
మార్గం సుగమం!
చిత్తూరులో రోడ్డు విస్తరణకు తుది ప్లాన్ ఆమోదం టీడీఆర్ బాండ్ల పంపిణీకి లైన్‌క్లియర్ మౌలిక వసతులకు రూ.100 కోట్ల వరకు అవసరం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచితేనే సదుపాయాలకు నిధులు
చిత్తూరు నగర నడిబొడ్డున రోడ్ల విస్తరణ అంశం తుది అంకానికి చేరుకుంది. మూడో దశ రోడ్ల అభివృద్ధి (ఆర్‌డీ) ప్రణాళికలను ఆమోదిస్తూ అధికారులు గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా స్వచ్ఛందంగా రోడ్డు విస్తరణకు భవన స్థలాన్ని ఇచ్చే యజమానులకు ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్లను ఇవ్వడానికి మార్గం సుగమమైంది. ఇక టీడీఆర్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి కార్పొరేషన్ కమిటీ అధికారికంగా బాండ్లను పంపిణీ చేయనుంది.
ఆర్‌డీ ప్లాన్ ఆమోదిస్తూ.. సంతకం చేస్తున్న కమిషనర్
చిత్తూరు హైరోడ్డులో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు
చిత్తూరు అర్బన్: మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రతీ పదేళ్లకు ఓసారి మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తారు. పెరుగుతున్న జనాభా, వాహనాలు, ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మాస్టర్ ప్లాన్ తయారుచేస్తారు. చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్‌లో 2022లో నూతన మాస్టర్ ప్లాన్ అమల్లోకి వచ్చింది. ఇది పదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. నూతన మాస్టర్ ప్లాన్ ప్రకా రం కట్టమంచి నుంచి గిరింపేట దుర్గమ్మ ఆలయం వరకు ఉన్న రోడ్డును వంద అడుగులకు విస్తరించాల్సి ఉంది. 2018లో హై రోడ్డులోని కృష్ణుడి ఆలయం నుంచి గిరింపేట దుర్గమ్మ ఆలయం వరకు ఆర్‌డీ ప్లాన్‌ను ఆమోదించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కట్టమంచి నుంచి రైల్వే అండర్ బ్రిడ్జి వరకు, తాజాగా రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి కృష్ణుడి ఆలయం వరకు ఆర్‌డీ ప్లాన్ ఆమోదించడంతో విస్తరణ పనులకు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో పాటు టీడీఆర్ బాండ్ల పంపిణీ ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లా న్యాయస్థానాల సముదాయ ప్రహరీ గోడ, రైల్వే స్టేషన్, వక్ఫ్‌బోర్డు, దేవదాయ శాఖ స్థలాల్లో కట్టడాలను తొలగించారు.
టీడీఆర్ బాండ్ల జారీ ఇలా..
విస్తరణలో భవనాలు, కట్టడాలు కోల్పోయేవారికి పరిహారం స్థానంలో టీడీఆర్ బాండ్లను ఇవ్వడానికే అధికారులు ఆసక్తి చూపిస్తున్నారు. చిత్తూరు హై రోడ్డు విస్తరణలో భవన యజమానులు 600–1000 అడుగుల వరకు స్థలాన్ని కోల్పోవాల్సి ఉంటుందని అంచనా. పరిహారమైతే భూమి రిజస్టర్ విలువ ప్రకారం రూ.100కు రూ.200 ఇస్తారు. టీడీఆర్ బాండ్లు ప్రతీ వంద అడుగులకు 400 అడుగుల విలువ చేసే పత్రాలు ఇస్తారు. గత టీడీపీ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లను జిల్లాలో మాత్రమే విక్రయించుకునే వెసులు బాటు ఉండగా, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో దీన్ని రాష్ట్రంలో ఎక్కడైనా విక్రయించుకునే అవకాశం కల్పించడంతో టీడీఆర్ బాండ్లకు విలువ పెరిగింది. టీడీఆర్ బాండు కలిగి వ్యక్తి.. తాను ఎక్కడైనా భవనం నిర్మించేటప్పుడు రెండు అంతస్తులకు అను మతి ఉంటే, టీడీఆర్ బాండు ద్వారా అదనంగా మరో రెండు అంతస్తులకు అనుమతులు పొందొచ్చు. భవ నం చుట్టూ సెట్‌బాక్స్‌ను కూడా వదలాల్సిన అవసరం ఉండదు. టీడీఆర్ బాండ్ల జారీ కమిటీలో సబ్–రిజిస్ట్రార్, రెవెన్యూ అధికారులను తొలగించి.. మునిసిపల్ కమిషనర్, సహాయ కమిషనర్, ఏసీపీ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆర్డీలను సభ్యులుగా ఉంచడంతో బాండ్ల జారీ సులభతరం కానుంది.
నిధులిస్తేనే అభివృద్ధి
చిత్తూరు కార్పొరేషన్‌లో ఇక ఎవరైనా విస్తరణ స్థలం కోల్పోయే వ్యక్తులు టీడీఆర్ బాండ్ల కోసం అధికారికంగా దరఖాస్తు చేసుకోవచ్చు. కమిటీ మార్కెట్ విలువను సబ్–రిజిస్ట్రార్ నుంచి తీసుకుని, భవన యజమానులకు టీడీఆర్ బాండ్లను జారీచేసి, ఆన్‌లైన్‌లో ఉంచుతుంది. అయితే విస్తరణలో మరో కీలక అంశం నిధుల విడుదల. ప్రస్తుతం 50 అడుగల మేరకు రోడ్డును విస్తరించాల్సి ఉంది. విస్తరించిన స్థలంలో రోడ్లు వేయడం, కాలువలు కట్టడం, విద్యుత్ లైన్లు, మౌలిక వసతులు, సదుపాయాల కల్పనకు దాదాపు రూ.100 కోట్లు అవసరం ఉంది. కార్పొరేషన్ వద్ద అంత నిధులు లేవు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి నిధులు తీసుకొస్తేనే చిత్తూరులో అభివృద్ధి చూడడం సాధ్యమవుతుంది. లేకుంటే రోడ్ల విస్తరణ కాస్త కొట్టేసిన భవనాలు, గుంతలు పడ్డ రహదారులతో అందహీనంగా కనిపించనుంది. దీనిపై కలెక్టర్ నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి నిధులు ఎలా తీసుకొస్తారని సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మార్గం సుగమం!