
12 ఏళ్ల తర్వాత విముక్తి
గుడిపాల: ఇటుక బట్టీలో బంధీలైన 23 మందికి ఎట్టకేలకు విముక్తి లభించింది. వివరాలు.. గుడిపాల మండలం, గట్రాళ్లమిట్ట గ్రామంలో ఇర్పాన్ అనే అతను ఇటుక బట్టీల వ్యాపారం చేస్తున్నాడు. ఇతని వద్ద 2013లో తమిళనాడు రాష్ట్రం, వేలూరుకు చెందిన 18 మంది, బంగారుపాళ్యం మండలానికి చెందిన ఐదుగురు ఎస్టీ కాలనీ వాసులు పనులకు వచ్చారు. అప్పట్లోనే ఇర్పాన్ వారికి అడ్వాన్స్‌గా రూ.5 వేలు ఇచ్చి పనిలో పెట్టుకున్నారు. అప్పటి నుంచి వారిని బంధీలుగా మార్చేశారు. ఇందులో ఆరుగురు మగవారు, మరో ఆరుగురు మహిళలు, 11 మంది పిల్లలు ఉన్నారు. వీరందరూ రోజూ ఇటుకలకు సంబంధించి మట్టి కలపడం, మోల్డింగ్ చేయడం, ఇటుకలను కాల్చడం, ఇటుకలు రవాణా చేయడం వంటి కార్యకలాపాలు చేసేవారు. ఇటీవల వీరిపై శారీరక దాడులు చేయడంతోపాటు అవమానకరమైన మాటలు, వేధింపులు ఎక్కువయ్యాయి. విషయం తెలుసుకున్న రెవెన్యూ, లేబర్, సోషల్ వెల్ఫేర్, స్థానిక పోలీసులు వెళ్లి వారి పరిస్థితులపై ఆరా తీశారు. వారికి జరుగుతున్న అవమానాలను తెలుసుకున్నారు. రోజుకు సుమారు 15 గంటలు పనిచేయిస్తుండడంతో పాటు తాత్కాలిక గుడారాలలో నివసిస్తూ, కరెంట్ కూడా లేకుండా జీవిస్తున్నట్టు గుర్తించారు.
జేసీ భరోసా
గుడిపాల మండలంలోని గట్రాళ్లమిట్టలో జరిగిన పరిణామాలపై ఎస్టీ లందర్నీ గుడిపాల తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించారు. జాయింట్ కలెక్టర్ విద్యాధరి కూడా రాత్రి 9గంటలకు అక్కడికి చేరుకుని ఎస్టీలతో మాట్లాడారు. వారి బాధలను తెలుసుకున్నారు. వారందరికీ ఆర్థిక సాయం చేయడంతో పాటు రిలీవింగ్ ఆర్డర్ కాఫీలను అందజేసి, వారి గ్రామాలకు పంపించారు. స్వేచ్ఛగా జీవించాలని సూచించారు. అనంతరం ఇటుక బట్టీ యజమాని ఇర్పాన్‌తో జేసీ మాట్లాడారు. ఇన్ని రోజులు వారిని ఎందుకు నీ అదుపులో పెట్టుకున్నావ్ అని ఆరా తీశారు. ఇటుక బట్టీ యజమానిపై కేసు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఆర్డీవో శ్రీనివాసులు, డెప్యూటీ తహసీల్దార్ వెంకటరమణ, సర్వేయర్ గోపీనాథ్, వీఆర్‌ఓలు పాల్గొన్నారు.

12 ఏళ్ల తర్వాత విముక్తి

12 ఏళ్ల తర్వాత విముక్తి