
పరిసరాల శుభ్రత అందరి బాధ్యత
చిత్తూరు అర్బన్: పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ చెప్పారు. స్వచ్ఛతాహి సేవ– 2025లో భాగంగా గురువారం చిత్తూరు నగరంలోని గంగినేని చెరువు వద్ద శ్రీఏక్ దిన్.. ఏక్ గంట.. ఏక్ సాత్ స్వచ్ఛతశ్రీ కార్యక్రమాన్ని కలెక్టర్‌తో పాటు మేయర్ అముద, కమిషనర్ నరసింహ ప్రసాద్ ప్రారంభించారు. పార్కులో వ్యర్థాలను తొలగించారు. స్వచ్ఛతా ప్రతిజ్ఞ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నగరాన్ని శుభ్రంగా ఉంచడం కోసం వందల మంది పారిశుద్ధ్య కార్మికులు వేకువజాము నుంచే పనిచేస్తున్నారన్నారు. 50 శాతం చెత్త ప్రజల ద్వారానే ఉత్పత్తి అవుతోందన్నారు. ప్రజలు బాధ్యతగా.. బిస్కెట్ కవర్లు, వాటర్ బాటిళ్లు, ఇతర వ్యర్థాలు రోడ్లపై పడేయకుండా అవగాహనతో వ్యవహరిస్తే పారిశుద్ధ్య కార్మికులపై పనిభారం తగ్గించడమే కాకుండా నగరం పరిశుభ్రంగా ఉంటుందన్నారు. ప్రార్థన స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, పచ్చదనం పెంచడానికి ప్రతినెలా మూడో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మేయర్ అముద మాట్లాడుతూ.. పారిశుద్ధ్య పనులు నిర్వహించే కార్మికులకు ప్రజలు సహకరించాలన్నారు. కమిషనర్ పి నరసింహ ప్రసాద్ మాట్లాడుతూ.. స్వచ్ఛతాహీ సేవ కార్యక్రమాల్లో భాగంగా నగరంలో మాస్ శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రతి వార్డు సచివాలయం పరిధిలో కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వాములను చేస్తూ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్‌రెడ్డి, సహాయ కమిషనర్ ప్రసాద్, ప్రజారోగ్యశాఖ అధికారి డా.లోకేష్, కార్పొరేటర్ ఇందు, మునిసిపల్ డీఈ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.