
భలే మంచి టెట్రా బేరము
పలమనేరు: కర్ణాటక టెట్రా ప్యాకెట్ల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఇటు చిత్తూరు జిల్లాతోపాటు అటు తమిళనాడుకు గుట్టుచప్పుడు కాకుండా తరలిపోతున్నాయి. కర్ణాటకలో 90 ఎంఎల్ ప్యాకెట్ టెట్రా ప్యాకెట్ రూ.45కే లభ్యమవుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు ఏపీలోని సరిహద్దు ప్రాంతాల నుంచి తమిళనాడుకు చేరవేస్తున్నారు. దీనికితోడు తమిళనాడులో మద్యం కొరతను సైతం తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు.
బజ్జీ దుకాణాల్లోనూ మద్యమే
కన్నడ టెట్రా ప్యాకెట్లతోపాటు ఏపీ మద్యం దుకాణాల నుంచి తీసుకెళ్లే మందు విక్రయాలు జిల్లాలోని అంతర్రాష్ట్ర సరిహద్దు నియోజకవర్గాల్లో ఊపందుకున్నాయి. గతంలో రహస్యంగా సాగుతున్న ఈ తంతు ఇప్పుడు బహిరంగగానే విక్రయిస్తున్నారు. గ్రామాల్లోని చిల్లరకొట్లు, టీ దుకాణాలు, హోటళ్లు, బజ్జీ, బోండా అంగళ్లల్లోనూ మద్యం లభిస్తోంది. కొందరైతే దీన్నే జీవనోపాధిగా చేసుకున్నారు.
రకరకాల మార్గాలు
కర్ణాటక రాష్ట్రం నుంచి తమిళనాడుకు ఎన్నో అడ్డదారులున్నాయి. రకరకాల మార్గాల్లో నిత్యం మద్యం అక్రమంగా తరలిస్తున్నారు. కన్నడ మద్యం దుకాణాల నిర్వాహకులకు ఆన్‌లైన్‌లో నగదును జమచేస్తే మద్యాన్ని వారే ఏపీ సరిహద్దుకు చేరవేస్తున్నారు. అక్కడి నుంచి స్మగ్లర్లు సులభంగా తమిళనాడుకు రవాణా చేస్తున్నారు. మరికొందరు కర్ణాటక నుంచి ఇక్కడికి చేరిన సరుకును ఇళ్లల్లో కాకుండా గ్రామాల్లోని పొలాలు, గడ్డివాములు, భూమిలో పాతిపెట్టి, ఆపై తమిళనాడుకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది.
చౌకబేరము!
కర్ణాటకాకు చెందిన విస్కీ, ఒరిజినల్ చాయిస్, డీలక్స్ విస్కీ, త్రిబుల్‌ఎక్స్ రమ్, ఓల్డ్ అడ్మిరల్, బ్రాందీ తదితర బ్రాండ్లు 180 ఎంఎల్ టెట్రా ఫ్యాకెట్ల రూపంలో దొరుకుతున్నాయి. అక్కడ వీటి ధరలు ఒక్కో ప్యాకెట్ 90 ఎంఎల్ రూ.45, క్వార్టర్ ప్యాకెట్ రూ.90గా ఉంది. అదే సరుకు తమిళనాడుకు చేరితే 90 ఎంఎల్ రూ.100, క్వార్టర్ రూ.140గా ఉంది. కన్నడ కిక్కుకు అలవాటు పడిన మందుబాబులు వాటి వైపే మొగ్గు చూపుతున్నారు. రోజుకు రెండు కేసులు అమ్మినా రూ.5 వేలదాకా మిగులుతోంది.
ఆగిన తనిఖీలు
గత ప్రభుత్వంలో సెబ్ స్క్వాడ్‌లు నిరంతరం బోర్డర్లలో నిఘా పెట్టేవారు. కర్ణాటక మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సెబ్‌ను తీసేసింది. కేవలం ఎక్సైజ్ శాఖ మాత్రమే అదీ మద్యం దుకాణాల నిర్వహణలో ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాపై అసలు తనిఖీలే లేకుండా పోయాయి.
ఏపీలో చీఫ్ ట్రిక్స్
ఏపీలోని మద్యం ప్రియులకు రూ.99కే మద్యం ఇస్తామన్న కూటమి ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. ఇక్కడున్న మద్యం కంటే కన్నడ మద్యం ధర తక్కువ. దీంతో కుప్పం, పలమనేరు, పుంగనూరు నియోజకవర్గాల్లో ఇప్పటికీ కన్నడ టెట్రాప్యాకెట్లే రాజ్యమేలుతున్నాయి.