
మరమ్మతులకు పచ్చజెండా
పాలసముద్రం : స్థానిక రెవెన్యూ కార్యాలయ మరమ్మతులకు నివేదికలు పంపాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ తహసీల్దార్ అరుణకుమారిని ఆదేశించారు. గురువారం పాలసముద్రం రెవెన్యూ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. పెచ్చులూడి, అధ్వానంగా ఉండడంతో వెంటనే మరమ్మతులకు చర్యలు చేపట్టాలన్నారు. ఎంతమేర నిధులు అవసరమవుతాయని ఏఈ జయరాజ్‌ను అడగగా రూ.15 లక్షల వరకు అవుతుందని చెప్పారు. రెవెన్యూ సమస్యలపై కార్యాలయానికి వస్తున్న రైతులతో స్నేహభావంతో మెలగాలని సిబ్బందిని ఆదేశించారు. చిత్తూరు నుంచి బలిజకండ్రిగకు వస్తున్న జాతీయ రహదిరి కూడా అధ్వాన్నంగా ఉందని, దాన్ని కూడా త్వరలో మరమ్మతులు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో వనదుర్గాపురం నుంచి మండల కేంద్రానికి రోడ్డు పనులు ప్రారంభించారని, అవి అర్ధంతరంగా ఆగిపోవడంతో తమిళనాడు రాష్ట్రం మీదుగా 15 కి.మీ చుట్టుతిరిగి రావాల్సి వస్తోందని ఎంపీపీ శ్యామలశివప్రకాష్ రాజు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. పరిశీలించి చర్యలు చేపడుతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఏఓ ఢిల్లీన్రసాద్, ఆర్‌ఐ దేవి, వీఆర్‌ఓ తంగరాజ్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయంతో సంపూర్ణ ఆరోగ్యం
పాలసముద్రం: ప్రకృతి వ్యవసాయ పంటలు, కూరగాయలను తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ తెలిపారు. గురువారం మహదేవపురం, తిరుమలరాజుపురంలో ప్రకృతి వ్వవసాయ క్షేత్రం, నర్సరీని ఆయన పరిశీలించారు. రసాయనాలతో సాగు చేసే పంటలు హానికరమని, రైతులు ప్రకృతి పద్ధతిలో సాగుపై ఆసక్తి చూపాలని తెలిపారు. అనంతరం తిరుమలరాజుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల సమీపంలో పాడైన బావిని పూడ్చి వేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ అరుణ కుమారి, ఆర్‌ఐ దేవి, వీఆర్‌ఓలు, రైతులు పాల్గొన్నారు.

మరమ్మతులకు పచ్చజెండా