
ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలి
చౌడేపల్లె: ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టిసారించాలని డీపీఎం జి.వాసు తెలిపారు. ఆయన గురువారం బోయకొండ సమీపంలోని గట్టువారిపల్లెలో ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచరల్ ఫామింగ్ రైతు సాధికార సంస్థ (ఈవీఎస్) ఆధ్వర్యంలో జిల్లాలో 263 క్లస్టర్లలో ప్రకృతి సేద్యంపై రైతులను చైతన్యవంతులను చేశామన్నారు. వేరుశనగ, వరి, కూరగాయల పంటలు సాగు చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లోనూ ప్రకృతి సేద్యం చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అనంతరం అక్కడే సాగుచేసిన వరిపంటతోపాటు కషాయాన్ని పరిశీలించి రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్‌పీ ఎంఎంటీ సుధాకర్ నాయుడు, ఎన్‌ఎఫ్‌ఏ నాంచారమ్మ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది గంగిరెడ్డి, రామనాథం, తదితరులు పాల్గొన్నారు.