
నోటీసు ఇవ్వకనే నగలు వేలం
పలమనేరు: తాము ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో తనఖా పెట్టిన నగలకు గడువు మీరిందని నోటీసు ఇవ్వకుండానే తమ బంగారాన్ని వేలం వేసిందే కాకుండా మళ్లీ నెలనెలా వడ్డీ వసూలు చేశారని బాధితులు ఆ కంపెనీ నిర్వాహకులను నిలదీశారు. ఈ ఘటన గురువారం పలమనేరులో చోటుచేసుకుంది. వివరాలు.. బైరెడ్డిపల్లి మండలం, సీసీగుంటకు చెందిన నల్లమణి 4.4 గ్రాములు, కేశవ 20 గ్రాముల బంగారు నగలను పట్టణంలోని కీర్తన ఫైనాన్స్ కంపెనీలో తనఖా పెట్టారు. ఇందుకు సంబంధించి వీరు నగలు సకాలంలో విడిపించుకోలేదని కంపెనీవారు గత ఏప్రిల్‌లో ఆ నగలను వేలం వేశారు. ఇందుకు సంబంధించి బాధితులకు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వలేదని బాధితులు తెలిపారు. అంతేకాకుండా మేలో సైతం తాము పెట్టిన నగలకు వడ్డీ కట్టించుకున్నారని ఆరోపించారు. నగలు ఇప్పటికే వేలం వేశారని తెలిసిన బాధితులు సంబంధిత కంపెనీ మేనేజర్‌తో గురువారం గొడవకు దిగారు. దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు వారు తెలిపారు.