
కాయకష్టమే!
ప్రకృతి ప్రకోపానికి తోడు ప్రభుత్వ ప్రోత్సాహం లేక వేరుశనగ రైతులు విలవిల్లాడుతున్నారు. వేల రూపాలు పెట్టుబడి పెట్టినా దిగుబడి నామమాత్రంగా కూడా లేకపోవడంతో ‘కాయ’ కష్టమే మిగిలిందని నిట్టూర్చుతున్నారు. దీనికితోడు గత ఏడాది పంట నష్టపరిహారమూ అందక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోకుంటే చావే శరణ్యమని గగ్గోలు పెడుతున్నారు.
కాణిపాకం: ఖరీఫ్‌లో ప్రతి ఏటా జిల్లాలో వర్షాధార పంటగా వేరుశ నగను రైతులు విత్తుతుంటారు. ఈసారి ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 80 వేల హెక్టార్లు కాగా.. వేరుశనగ పంట సాధారణ విస్తీర్ణం 35,238 హెక్టార్లుగా అధికారులు లెక్కలుగట్టారు. ప్రభుత్వం 30,283 క్వింటాళ్ల కాయలు సరఫరా చేసింది. ఒక్కో రైతుకు ఒక్కో బ్యాగు కాయలు ఇచ్చారు. మిగిలిన కాయలు ఏమయ్యాయో దేవుడుకే ఎరుక. దీనికారణంగా 4,092 హెక్టార్లల్లో మాత్రమే వేరుశనగ సాగులోకి వచ్చింది. వర్షాభావ పరిస్థితులు, ప్రభుత్వ ప్రోత్సాహం, విత్తనాలు పూర్తి స్థాయిలో అందక పోవడంతో చాలామంది రైతులు వేరుశనగ సాగుపై ముఖం చాటేశారు.
తడి ఆరిన ఆశలు!
జిల్లాలో 10 నుంచి 15 శాతం మంది రైతులు వేరుశనగ విత్తారు. జూన్, జూలై నెలల్లో తీవ్ర వర్షాభావం నెలకొనడంతో పంట ఎండుముఖం పట్టింది. తర్వాత అదునుకు తగ్గ వర్షాలు లేవు. ఇది పంట దిగుబడిపై ప్రభావం చూపింది. ఊడలు దిగే సమయంలో కూడా వర్షం కరుణించకపోవడంతో రైతుల చేతికి తీగలు మాత్రమే మిగిలాయి. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలు పంట ఒబ్బిడికి ప్రయోజనకరంగా మారాయి.
పరిహారం ..పరిహాసం!
2024 ఖరీఫ్‌లో వేరుశనగ సాధారణ విస్తీర్ణం 43,174 హెక్టార్లు కాగా 13,044 హెక్టార్లల్లో పంట సాగులోకి వచ్చింది. అయితే వర్షం కరుణించక పోవడంతో పూర్తిగా దెబ్బతింది. పరిశీలనకు దిగిన వ్యవసాయ శాఖ అధికారులు 9వేల హెక్టార్లల్లో మాత్రమే పంట దెబ్బతిన్నట్లు నివేదికలు పంపారు. 24,342 మంది రైతులకు గాను రూ.15.42 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు తేల్చారు. గుడిపాల, పెనుమూరు, యాదమరి మండలాలను అత్యంత కరువు మండలంగా ప్రకటించారు. మరో 13 మండలాలను మధ్యస్థ కరువు మండలాలుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనవరి 8వ తేదీన కేంద్ర బృందం యాదమరి, గుడిపాల మండలాలను సందర్శించింది. ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులతో ముఖాముఖి నిర్వహించింది. అయితే నష్టపోయిన రైతులకు పరిహారం ఇంతవరకు ఇవ్వకపోవడంపై పలువురు మండిపడుతున్నారు.
కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు వేరుశనగ ఒబ్బిడిలో బిజీబిజీగా మారారు. అయితే దిగుబడి చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. చెట్టుకు రెండు గట్టి కాయలు కూడా లేకపోవడంతో పెట్టుబడిపై పూర్తిగా ఆశలు వదులుకుంటున్నారు. ఎకరాకు 15 బ్యాగులకుగాను (బ్యాగుకు 40 కేజీలు) రెండుమూడు బ్యాగులు కూడా వచ్చేపరిస్థితి లేదని రైతులు నిట్టూర్చుతున్నారు. 3 శాతం మంది రైతులు మాత్రం బోర్ల కింద పంటను కాపాడుకోగలిగారు.
కాయలు లేవు
నేను 1.5 ఎకరాల్లో వేరుశనగ వేశా. పెట్టుబడి 30 వేలు అయ్యింది. ఐదు బ్యాగుల కాయలకే 10 వేల దాకా పెట్టా. ప్రభుత్వం ద్వారా ఒక్క బ్యాగు కాయలు మాత్రమే ఇచ్చారు. కొంతమంది సాయంతో నాలుగు బ్యాగుల కాయలు సంపాదించా. వేస్తే చెట్టుకు గట్టి కాయలు రెండు కూడా లేవు. పెట్టిన పెట్టుబడి కూడా రాదు. గతేడాది కూడా పూర్తిగా నష్టపోయాం. ఇంత వరకు పరిహారం ఇవ్వలేదు. ఈ ఏడాది కూడా నష్టపోయాం. ప్రభుత్వం పరిహారం ఇస్తే రైతులు కోలుకుంటారు. –పట్టాభి, పాలూరు, చిత్తూరు మండలం

కాయకష్టమే!