
ఎర్రమట్టి.. కొల్లగొట్టి
టాస్క్‌ఫోర్స్ : చౌడేపల్లి మండలంలోని చెరువుల్లో మట్టి, ఇసుక డంప్ చేసినా అధికారులకు కనపడడంలేదు. రెవెన్యూ , నీటిపారుదల , పోలీసులు, రవాణా శాఖ అధికారులు తెలిసినా నోరు మెదపడంలేదని స్థానికుల నుంచి తీవ్ర విమర్శలున్నాయి. జేసీబీ, ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా రాత్రిపూట అక్రమంగా రవాణా చేస్తున్నా అడిగే నాథుడే కరవయ్యారు. రాత్రిపూట ప్రభుత్వ స్థలాల్లోని ఎర్రమట్టిని జేసీబీతో పెకలించి ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా రవాణా సాగిస్తున్నారు. ఒక లోడు ఎర్రమట్టి రూ.600 నుంచి దూరాన్ని బట్టి రూ.750 వరకు తీసుకుంటున్నారు. ఎర్రమట్టి కనిపిస్తే చాలు జేసీబీలు పెట్టి తవ్వి అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై కూటమి నేతలు బెదిరిస్తున్నారు.
గుట్టను చదును చేస్తున్నా...
పెద్దకొండామర్రి పాలింపల్లె వద్ద ఇమాంసాబ్‌కు చెందిన పొలంలో రాత్రిపూట గ్రావెల్ తీస్తుండగా సమాచారం తెలుసుకొని అడ్డుకొని వాహనాలను వెనక్కు పంపారు. చెడుగుట్ల పల్లె సమీపంలోని మనుకూరమ్మ గుట్ట వద్ద గల ప్రభుత్వ స్థలాలు, గుట్టలోని ఎర్రమట్టిని సైతం వదలడంలేదు. శెట్టిపేట పంచాయతీ తోటకురప్పల్లె వద్ద గల అడ్డ గుట్ట అటవీ స్థలంలో ఎర్రమట్టిని దర్జాగా తరలిస్తూ గుట్టనే చదును చేస్తున్నా అటవీశాఖ అధికారులు నోరు మెదపడం లేదు. చెరువుల్లో ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్నా అధికారులు కన్నెత్తి చూడడంలేదు.
ఇసుక డంప్‌లున్నా ఉదాసీనతే..
అక్రమార్కులకు ఇసుక కాసుల వర్షం కురిపిస్తోంది. ఇసుకను డంప్ చేయడం విరుద్దమని తెలిసినా డంప్ ఉన్నప్పటికీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడం విమర్శలు చెలరేగుతున్నాయి. ట్రాక్టర్ ద్వారా రూ.5 నుంచి రూ. 6 వేల చొప్పున గ్రామాల్లో విక్రయిస్తున్నా అధికారులు చర్యలు చేపట్టడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు.
తోటకురప్పల్లెవద్ద అడ ్డగుట్టను
తవ్వి మట్టిని తరలిస్తున్న దృశ్యం

ఎర్రమట్టి.. కొల్లగొట్టి