చౌడేపల్లె : వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్‌వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ తీగలు చోరీ చేసే నిందితుడు బీట్ పోలీసులకు జంగాలపల్లె వద్ద పట్టుబడిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మంగళవారం రాత్రి చారాల మార్గంలో కానిస్టేబుళ్లు మునిరాజ, శ్రీనివాసులు బైక్‌పై చారాలకు వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు సంచిలో వైర్లతో వెళ్తుండగా గమనించిన కానిేస్టేబుళ్లు జంగాలపల్లె మార్గంలో ఛేజింగ్ చేశారు. పట్టుబడిన దొంగల్లో పుంగనూరు మేలిపట్లకు చెందిన గంగాధర్ పట్టుబడగా మరొక దొంగ పరారైయ్యాడు. వారి వద్ద గల సుమారు 500 మీటర్ల కేబుల్ వైర్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఎక్కడెక్కడ చోరీ చేశారు..? ఎక్కడ విక్రయిస్తున్నారు అనే కోణంలో పోలీసులు ఆరా తీశారు. కాగా దొంగను పుంగనూరు పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.
జేడీవీగా ఉమామహేశ్వరి బాధ్యతల స్వీకరణ
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లా పశుసంవర్థకశాఖ జేడీగా ఉమామహేశ్వరి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. చిత్తూరు నగరంలోని కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించగా పలువురు కలిశారు. అనంతరం శాఖ అధికారులతో చర్చించారు. పాడి పరిశ్రమలో ఎదురవుతున్న సమస్యలపై ఆరాతీశారు.
పకడ్బందీగా ఓటరు జాబితా కసరత్తు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కసరత్తు పకడ్బందీగా చేపడుతున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌లోని ఎన్నికల గోడౌన్‌ను తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 2002 ఓటరు జాబితాలో 2025 ఓటరు జాబితాను సరిపోల్చే కార్యక్రమం జిల్లాలో చేపడుతున్నామన్నారు. ఈ ప్రక్రియ జిల్లాలో ఈనెల 19 నుంచి 26 వరకు నిర్వహిస్తామన్నారు. ఇప్పటి వరకు 25 శాతం ఓటరు జాబితా సరిపోలిందన్నారు.
ఈ ప్రక్రియలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో బోగస్, మృతిచెందిన ఓటర్లను జాబితా నుంచి తొలగించడం జరుగుతుందన్నారు. పారదర్శకమైన ఓటర్ జాబితాకు చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, డీఆర్‌వో మోహన్‌కుమార్, కలెక్టరేట్ ఏవో వాసుదేవన్, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ రాజేంద్ర పాల్గొన్నారు.