
ప్రైవేటు బస్సు బోల్తా
పూతలపట్టు (యాదమరి) : పూతలపట్టు మండలం పాలమూరు సమీపంలో బెంగళూరు–తిరుపతి జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడిన ఘటనలో 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీసుల కథనం మేరకు... బెంగళూరు నుంచి తిరుపతి వైపుగా 40 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో అతి వేగంతో ప్రయాణిస్తున్న బస్సు పూతలపట్టు మండల పరిధి పాలమూరు గ్రామ సమీపానికి రాగానే ఎదురుగా వెళ్తున్న ఓ ఐచర్ వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో మొత్తం 22 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో బెంగళూరుకు చెందిన హైమ, పుష్పవతి, సౌభాగ్య, భారతి, దివ్యశ్రీ, సంపూర్ణ, లత, సునిత, లక్ష్మి, లీలావతి, మునిరాజ్, సాంసన్, వెంకటరమణ, అరుణ్‌కుమార్, ఉదయ్, మునిసోమేష్, సంజన్, కృష్ణమూర్తి, లవ, మోహిత్‌రావు, శ్రీనివాసులు, వినయ్ ఉన్నారు. గాయపడ్డవారిని స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 108 వాహనం ద్వారా క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. పూతలపట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రైవేటు బస్సు బోల్తా