
శుభలేఖ ఇస్తామని పిలిచి చితకబాదారు
చౌడేపల్లె : ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమైన స్నేహితుడికి తన వివాహపు శుభలేఖ ఇవ్వాలని, పిలిచి కట్టెలతో చితకబాదిన ఘటన బోయకొండ మార్గంలోని మిట్టూరుకు వెళ్లే కూడలిలో బుధవారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పుదిపట్ల పంచాయతీ మిట్టూరుకు చెందిన గణేష్ (22) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో నిమ్మనపల్లె మండలం పిఠావాండ్లపల్లెకు చెందిన సతీష్‌తో గతేడాదిగా ఇన్‌స్ర్ట్రాగామ్‌లో పరిచయమయ్యాడు. వీరిద్దరూ స్నేహితులు కావడంతో బుధవారం తన పెళ్లని శుభలేఖ ఇవ్వాలని బోయకొండ మార్గంలోని మిట్టూరు కూడలిలో ఉన్నానని త్వరగా రా.. నేను మళ్లీ వెళ్లాలంటూ ఫోన్ చేశాడు. ఇంటి వద్ద ఉన్న గణేష్ అతడితో పాటు నాగార్జున కలిసి బైక్‌పై వెళ్లారు. సతీష్‌తోపాటు మరో 8 మంది కలిసి గణేష్ చేతిలోని సెల్‌ఫోన్‌ను లాక్కొని వెంట తెచ్చుకొన్న కర్రలతో మూకుమ్మడిగా కలిసి చితకబాదారు. కేకలు వేయడంతో చుట్టు పక్కలవారు అక్కడికి చేరుకొని అడ్డుకొనే ప్రయత్నం చేసినప్పటికీ దారుణంగా చితకబాదారన్నారు. హతమార్చడానికే వారువచ్చారని అదే గ్రామానికి చెందిన గోపాల్‌తో తనకు పాత కక్షలున్నాయని అతడే ఈ దురాగతానికి పాల్పడ్డారని, అతను కూడా ఘటనా స్థలంలోనే ఉన్నాడని ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అతడిని పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

శుభలేఖ ఇస్తామని పిలిచి చితకబాదారు