
‘నా భూమిని లాక్కున్నారు..న్యాయం చేయండి’
పలమనేరు : తన భూమిని పరిశ్రమల కోసమంటూ రెవెన్యూ అధికారులు అన్యాయంగా స్వాధీనం చేసుకున్నారని తనకు న్యాయం చేయాలంటూ పట్టణానికి చెందిన రాజేశ్వరి అనే బాధితురాలు మీడియాను ఆశ్రయించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగమంగళం రెవెన్యూలో రాళ్లు, చెట్లతో ఉన్న మూడెకరాల పొలాన్ని రాజేశ్వరి కుటుంబీకులు వ్యవసాయ యోగ్యంగా మార్చుకుని 30 ఏళ్లుగా వర్షాధారిత పంటలను సాగు చేసుకుంటున్నారు. ఇందుకు రెవెన్యూ అధికారులు 2005లో డీకేటీ పట్టాను మంజూరు చేశారు. ఇందుకు పట్టాదారుపాసు పుస్తకాలను మంజూరు చేయాలని బాధితురాలు పలు దఫాలు స్థానిక రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్నారు. అయినా ఇవ్వకపోవడంతో బాధితురాలు 2023లో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల సైతం ఇక్కడి అధికారులు పట్టించుకోలేదు. ఈ భూమిని పరిశ్రమల స్థాపనకోసం ప్రభుత్వం తీసుకుంది. దీనిపై బాధితురాలు బుధవారం భూమి వద్దకెళ్లి తనకు న్యాయం చేయాలని కోరగా ఇది ప్రభుత్వం ఇచ్చిన స్థలమంటూ ఎలాంటి హక్కులేదంటున్నారని బాధితురాలు వాపోయింది.