
గిరిజనులకు కలెక్టర్ వరాలు
సోమల(చౌడేపల్లె): సోమల మండలం, ఇరికిపెంట పంచాయతీ, పాయలగుట్ట, గువ్వలగుట్ట గిరిజనులకు కలెక్టర్ సుమిత్‌కుమార్ వరాలు కురిపించారు. మంగళవారం అధికారులతో కలిసి ఆయన కాలినడకన గిరిజనులున్న ప్రాంతాలకు చేరుకొని వారితో మమేకమయ్యారు. తర్వాత సమస్యలపై ఆరా తీశారు. గుడిెసెలు, పాకల్లో నివాసమున్న 14 మందికి పక్కా గృహాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక్కో ఇంటికి రూ.1.5 లక్షల చొప్పున మంజూరు చేస్తామన్నారు. ఆధార్, రేషన్ కార్డులు లేని వారిని గుర్తించి వెంటనే జారీచేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రతి విద్యార్థినీ బడికి పంపాలని, విద్యతో గిరిజన కుటుంబాల్లో మార్పు వస్తుందని సూచించారు. పాయలగుట్ట గ్రామస్తులనడిగి సమస్యలు తెలుసుకున్నారు. దారిసౌకర్యం కల్పించాలని కోరారు. చెన్నపట్నం చెరువు కట్టకింద గువ్వలగుట్టకు వేళ్లే మార్గంలో దారికి గండిపడి కోతకు గురైందని, వెళ్లడానికి ఇబ్బందికరంగా మారిందని చెప్పడంతో వెంటనే కల్వర్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పాయలగుట్టలో హేచరీ వల్ల ఇబ్బంది పడుతున్నామని కలెక్టర్‌కు తెలిపారు. గువ్వలగుట్టలో యానాది కవిత, పాయలగుట్టలో హనుమంతప్ప పేరిట భూమి పట్టాతోపాటు కరెంటు సర్వీసు వెంటనే మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట డీపీఓ సుధాకర్, తహసీల్దార్ మధుసూదన్, ఎంపీడీఓ ప్రసాద్, ఇరిగేషన్ అధికారిణి ఝూన్సీ, సర్పంచ్ రెడ్డెప్ప, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసులనాయుడు, ఇరికిపెంట చెరువు కట్ట చైర్మన్ గల్లా బోస్ తదితరులు పాల్గొన్నారు.
గువ్వలగుట్టలో గిరిజనుల సమస్యలు
తెలుసుకుంటున్న కలెక్టర్ సుమిత్‌కుమార్
గిరిజనుల గుడిసెలు పరిశీలిస్తున్న
కలెక్టర్ సుమిత్‌కుమార్

గిరిజనులకు కలెక్టర్ వరాలు