
దౌర్జన్యం చేస్తున్నారు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): భాగ పరిష్కారం ద్వారా సంక్రమించిన ఇంటి స్థలాన్ని ఆక్రమించేందుకు జీడీ నెల్లూరు మండలం పాత వెంకటాపురం పంచాయతీ గెరికలపల్లికి చెందిన సందీప్ నాయు డు, మనోహర్ నాయుడు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని అదే గ్రామానికి చెందిన మహాలక్ష్మీ ఆరోపించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్‌లో మంగళవారం ఆమె మాట్లాడారు. తమ గ్రామంలో ఉన్న ఆస్తిని గతంలో పూర్వీకులు సమంగా పంచి ఇచ్చారని చెప్పారు. అయితే ఈ భూమిని ఆక్రమించేందుకు సందీప్ నాయుడు తప్పుడు పత్రాలు సృష్టించి వేధిస్తున్నారని వాపోయారు. వారి దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా తమ పైనే ఫిర్యాదు చేస్తారా అంటూ బెదిరించారని కన్నీటి పర్యంతమయ్యారు. సందీప్ నాయుడుతో పాటు అతని అనుచరులు బాబు నాయుడు, నీరజాక్షుల నాయుడు నుంచి ప్రాణహాని ఉందని చెప్పారు. జిల్లా ఎస్పీ స్పందించి చట్టపరంగా తమకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు.