
ప్రభాకర్ కోసం ముమ్మర గాలింపు
15 ప్రత్యేక బృందాల ఏర్పాటు 70 కేసుల్లో ముద్దాయి నాలుగు రాష్ట్రాల్లో కేసులు ఇద్దరు ఎస్కార్ట్ కానిస్టేబుళ్ల సస్పెన్షన్ డీఎస్పీ దేవకుమార్
దేవరపల్లి: పోలీసుల కళ్లు కప్పి సోమవారం రాత్రి పారిపోయిన కరుడు గట్టిన నేరస్తుడు బత్తుల ప్రభాకర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివిధ కేసుల్లో ముద్దాయిగా ఉండి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్న ప్రభాకర్ తూర్పు గోదావరి జిల్లా, దేవరపల్లి మండలం, దుద్దుకూరు వద్ద చేతులకు బేడీలతో పరారైన ఘటన పాఠకులకు తెలిసిందే. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏలూరు డీఐజీ అశోక్‌కుమార్, జిల్లా ఎస్పీ నరసింహకిషోర్, సీఐ నాగేశ్వరనాయక్ ఘటనా స్థలానికి చేరుకుని నేరస్తుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 50 మంది యువకులతో బైక్‌లపై పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అర్ధరాత్రి వరకు యువకులు, పోలీసులు పొలాల్లో గాలించారు.
కరుడుగట్టిన నేరస్థుడు ప్రభాకర్
చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ కరుడుగట్టిన నేరస్తుడని పోలీసులు చెబుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో అతనిపై అనేక కేసులు ఉన్నాయి. పలు కేసుల్లో రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉంటున్నాడు. సోమవారం ఉదయం ఒక కేసులో పోలీసులు విజయవాడ కోర్టుకు తీసుకు వెళ్లి తిరిగి వస్తుండగా దేవరపల్లి మండలం, దుద్దుకూరు వద్ద హైవేపై గల హోటల్ వద్ద ఆగారు. ఆ సమయంలో ప్రభాకర్ టీ తాగడానికి చేతులకు ఉన్న హ్యాండ్స్ కప్స్‌ను ఒక చేతిది తీసి మరొక చేతికి ఉంచారు. టీ తాగుతున్న క్రమంలో ప్రభాకర్ ఎస్కార్ట్ పోలీసుల కళ్లు కప్పి హోటల్ వెనుక నుంచి పొలాల్లోకి పరారయ్యాడు. పోలీసులు వెంటపడినప్పటికీ దొరకలేదని డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. ప్రభాకర్‌కు ఇద్దరు ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు ఎస్కార్ట్‌గా వెళ్లారు. వీరిద్దరిని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశారు.
15 ప్రత్యేక బృందాల ఏర్పాటు
పోలీసుల కళ్లుకప్పి పరారైన నేరస్థుడు బత్తుల ప్రభాకర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. మంగళవారం దేవరపల్లి పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముద్దాయి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. నేరస్థుడు ప్రభాకర్‌పై ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో సుమారు 80 కేసులు నమోదైనట్టు తెలిపారు. 2011 నుంచి ప్రభాకర్ నేరాలకు పాల్పడుతూ పట్టుబడినట్టు ఆయన చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్లలో దొంతనం కేసుల్లో ముద్దాయిగా ఉన్న ట్టు పేర్కొన్నారు. 2022లో హైదరాబాద్‌లోని గచ్‌బౌలిలోని పబ్‌లో ఉన్న అతనిని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై ప్రభాకర్ కాల్పులు జరిపినట్టు తెలిపారు. ఫీజులు కట్టే సమయంలో విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, గృహాలను లక్ష్యంగా పెట్టుకుని ఒంటరిగా దొంగతనాలు చేస్తాడన్నారు. ఉండ్రాజవరం మండలం వేలివెన్ను కాలేజీలో రూ.30 లక్షలు, దేవరపల్లి మండలంలో రోమన్ కేథలిక్స్ స్కూల్లో రూ.3 లక్షలు చోరీ చేసినట్టు తెలిపారు. పారిపోయిన సమయంలో చేతికి హ్యాండ్ కప్స్, వైట్ కలర్ టీ షర్టు, బ్లాక్ కలర్ ట్రాక్ ఫ్యాంటు ధరించి ఉన్నట్టు తెలిపారు. ఎక్కడెక్కడ నేరాలు చేస్తున్నాడు, సన్నిహితుల ఆచూకీని తెలసుకుంటున్నట్టు చెప్పారు. ముద్దాయి ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల పారితోషికం ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు దేవరపల్లి పోలీసుల మొబైల్ నెంబర్లు 94407 96584 (సీఐ), 9440796624 (ఎస్సై)కు సమాచారం ఇవ్వాలని కోరారు.

ప్రభాకర్ కోసం ముమ్మర గాలింపు

ప్రభాకర్ కోసం ముమ్మర గాలింపు