
అప్పు చెల్లించలేదని హత్య?
–పూతలపట్టులో హోటల్ యజమాని ఘాతుకం
పూతలపట్టు(యాదమరి): పూతలపట్టు మండల పరిధి, రంగంపేట క్రాస్ సమీపంలోని ఓ హోటల్ యజమాని తన దగ్గర పనిచేస్తున్న ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మండలంలో చర్చనీయాంశమైంది. పోలీసుల కథనం.. రంగంపేట క్రాస్ సమీపంలోని ఓ ప్రముఖ కర్మాగారం దగ్గర బంగారుపాళ్యంకు చెందిన విజయ్‌నాయుడు హోటల్ నడుపుతున్నాడు. చంద్రగిరి మండలం, ఐతేపల్లి గ్రామానికి చెందిన రూబన్(42) ఆ హోటల్‌లో పనిచేయడానికి సదరు యజమానిని అడిగాడు. అందుకు సమ్మతించిన విజయ్‌నాయుడు అడ్వాన్సుగా రూ.20 వేలు రూబన్‌కి ఇచ్చాడు. డబ్బులు తీసుకున్న తరువాత ఎంతకీ విధులకు రాకపోవడంతో విషయాన్ని రూబన్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారి సూచన మేరకు కొద్దిరోజులుగా రూబన్ హోటల్‌లో పనిచేసుకుంటున్నాడు. సోమవారం రాత్రి విధులు పూర్తయ్యాక విజయ్‌నాయుడు, అతని స్నేహితుడు శ్రీను, రూబన్ ముగ్గురూ కలసి తిమ్మిరెడ్డిపల్లి జగనన్న కాలనీలోని రూబన్ ఇంటికి వెళ్లారు. అక్కడ ముగ్గురూ మద్యం సేవించారు. మద్యం మత్తులో రూబన్ తీసుకున్న డబ్బుల విషయంగా అక్కడ వాగ్వాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. విజయ్‌నాయుడు, రూబన్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విచక్షణ కోల్పోయిన విజయ్‌నాయుడు, అతని స్నేహితుడు శ్రీను రూబన్‌పై దాడి చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో భయాందోళనకు గురైన విజయ్ పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సోమవారం రాత్రి రూబన్‌ను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మంగళవారం మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తీసుకున్న అప్పు చెల్లించలేదనే రూబన్‌ను హత్య చేశారని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

అప్పు చెల్లించలేదని హత్య?