
దళిత కుటుంబంపై కూటమి ఆటవిక చర్య
గంగవరం: దళితుల పక్షాన నిలబడి తమకు న్యాయం చేయాల్సిన కూటమి ప్రభుత్వం అగ్రవర్ణాలకు దాసోహమై దళితులపైనే దాడులు, దౌర్జన్యాలకు పూనుకోవడం సమంజసం కాదని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కల్లుపల్లి పంచాయతీ బూడిదపల్లిలో సోమవారం దళిత కుటుంబానికి చెందిన రేకుల ఇంటిని రెవెన్యూ, పోలీసు అధికారులు కూల్చివేసిన ఘటనపై నియోజకవర్గంలోని దళిత సంఘాల నాయకులు స్పందించారు. గంగవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన తెలిపారు. బాధితులైన నరసింహులు కుటుంబానికి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కె.వి.పి.ఎస్), వ్యవసాయ కార్మిక సంఘాల నాయ కులు మద్దతుగా నిలిచారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు ఓబుల్‌రాజు మాట్లాడుతూ దళిత కుటుంబంపై కూటమి ప్రభుత్వ ఆటవిక చర్యగా పరిగణిస్తున్నామన్నారు. ఇదే గ్రామంలో టీడీపీకి చెందిన పెత్తందారీలు అనేకమంది కుంట పొరంబోకు, దళితుల శ్మశాన వాటిక దాదాపు 16 ఎకరాలకు పైగా ఆక్రమించుకుంటే అధికారులు నిద్రావస్థలో ఉన్నారని ఆరోపించారు. అదే పాడుబడిన బావి ఆనుకుని సెంటు స్థలంలో తరతరాలుగా ఉన్న రేకుల ఇంటిని కూల్చి నేలమట్టం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఘటన జరుగుతున్న సందర్భంలో నరసింహులు భార్య మణెమ్మ మనస్తాపానికి గురై అధికారుల కళ్లెదు టే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించినా పట్టించుకోలేదన్నారు. చావు వతుకుల్లో ఉన్న మహిళను ఆస్పత్రికి తరలించకుండా ఇంటి నుండి పక్కకు తోసేసి బాధితులను నానా రకాలుగా దూషించడం దళిత హక్కులను ఉల్లంఘించడం కాదా అని ప్రశ్నించారు. ఆమె ప్రాణాలకు హాని జరిగితే అందుకు బాధ్యులు తహసీల్దార్ రేఖ, పోలీసు అధికారులే కారకులవుతారని హెచ్చరించారు. దళితులపై ఇంతటి వివక్ష చూపుతున్న అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే గ్రామంలోని పెత్తందారీలు ఆక్రమించుకున్న పొరంబోకు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బాధితు లు చాలాసేపు కార్యాలయం ఎదుట నిరసన తెలిపినా అధికారులు ఏమాత్రం స్పందించలేదు. తహసీల్దార్ రేఖ సెలవులో ఉండడంతో డీటీ సహానాకు అర్జీని సమర్పించారు. కార్యక్రమంలో దళిత నాయకులు ఈశ్వర, బాధిత కుటుంబాల ప్రజలు పాల్గొన్నారు.