
అమ్మా..గంగమ్మా!
నేటి నుంచి దసరా మహోత్సవాలు రూ.5,116 చెల్లిస్తే ఉభయదారులుగా పాల్గొనొచ్చు
బోయకొండ(చౌడేపల్లె): దసరా మహోత్సవాలకు బోయకొండ గంగమ్మ ఆలయం ముస్తాబైంది. మంగళవారం నుంచి అక్టోబరు 2వ తేదీ గురువారం వరకు పది రోజులపాటు అంగరంగ వైభవంగా శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు బోయకొండ ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే అమ్మగా పేరొందిన బోయకొండ అమ్మకు కన్నుల పండువగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
పవిత్రమైన పుష్కరిణి తీర్థం
అమ్మవారి ఆలయ సమీపాన ఉన్న పుష్కరిణిలోని నీరు అతి పవిత్రమైన తీర్థంగా భక్తులు భావిస్తారు. ఈ తీర్థాన్ని సేవించడం వల్ల సకల రోగాలు మాయమవుతాయని, పంటలపై తీర్థాన్ని చిలకరిస్తే చీడ, పీడలు తొలగుతాయని భక్తుల నమ్మకం. దుష్టసంబంధమైన గాలి భయాలు దూరమవుతాయని భక్తుల విశ్వాసం. రూ.20కే బాటిల్‌తో సహా తీర్థాన్ని భక్తులకు అందిస్తున్నారు.
పుష్ప మహిమ
భక్తులు తమ కోరికలు నేరవేరుతాయో లేదో తెలుసుకునేందుకు మ్మవారి శిరస్సుపై మూడు పుష్పాలుంచి కోరికలను మనస్సులో స్మరించమంటారు. అమ్మవారు కుడివైపున పుష్పం పడితే కోరికలు తీరుతాయని, ఎడమవైపు పడితే ఆలశ్యంగా నెరవేరుతాయని, మధ్యలో పడితే తటస్థంగా భావించవచ్చని భక్తులు విశ్వసిస్తుంటారు.
రవాణా మార్గాలు
చౌడేపల్లె నుంచి బోయకొండ ఆలయం వద్దకు 12 కి.మీ దూరం ఉంది. ఈ మార్గంలో ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. అలాగే పుంగనూరు నుంచి బోయకొండకు 14 కి.మీ దూరం. మదనపల్లె నుంచి 16 కి.మీ. ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడి నుంచే కాకుండా బెంగళూరు నుంచి కూడా బోయకొండకు ప్రత్యేకంగా కర్ణాటక ఆర్టీసీ బస్సు సర్వీసులున్నాయి. గతంలో గతుకుల రోడ్లులతో భక్తులు ఇబ్బందులు పడేవారు. గత ప్రభుత్వం డబుల్ రోడ్డు ఏర్పాటు చేయడంతో ప్రయాణానికి సౌకర్యవంతంగా ఉంది. కొండ కింద నుంచి ఆలయం వరకు ప్రయివేటు వాహనాల ద్వారా ప్రయాణం చేయొచ్చు.
ప్రత్యేక సౌకర్యాలు
దసరా మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. దసరా మహోత్సవాల్లో పాల్గొన దలచిన ఉభయదారులు రూ.5,116 చెల్లించాల్సి ఉంటుందని ఈఓ పేర్కొన్నారు. దుర్గా సప్తశతి చండీహోమం (పౌర్ణమి రోజున) పాల్గొనే ఉభయదారులు రూ.2,116, శ్రీఘ్రఫలదాయిని పూజలో పాల్గొనే భక్తులు రూ.516 చెల్లించొచ్చు. రూ.వెయ్యి చెల్లించి వేద ఆశీర్వాదం టికెట్టు కొనుగోలు చేసిన ఇద్దరు భక్తులకు దర్శనంతోపాటు వేద ఆశీర్వాదం పొందవచ్చు. ఉభయదారుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు ఊంజల్ సేవ, అభిషేకం, గణపతి, చండీహోమాలు నిర్వహించేలా ఏర్పాట్లు సినట్టు ఈఓ తెలిపారు. ఉభయదారులకు అమ్మవారి ప్రసాదం, పవిత్రమైన శేషవస్త్రం, చీరతో పాటు రవిక పీసు, అమ్మవారి కుంకుమ, గాజులు, అమ్మవారి మెమెంటో ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
బోయకొండ ఆలయ ముఖచిత్రం
బోయకొండ గంగమ్మతల్లి
కోరిన కోర్కెలు తీర్చే అమ్మ బోయకొండ గంగమ్మ
దశావతారాలు
ఈ నెల 23 నుంచి అమ్మవారికి పది రోజుల పాటు ప్రత్యేక అలంకరణలు చేపట్టనున్నారు. 23న శ్రీబాలాత్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. 24న శ్రీపార్వతీదేవిగా, 25న శ్రీఅన్నపూర్ణాదేవి, 26న శ్రీధనలక్ష్మిదేవిగా, 27న శ్రీశాఖాంబరీదేవిగా, 28న శ్రీమహాచండీదేవిగా, 29న శ్రీసరస్వతీదేవిగా, 30న దుర్గాదేవిగా, అక్టోబరు 1న శ్రీమహిషాసురమర్థినిగా, 2న శ్రీరాజ రాజేశ్వరిదేవిగా బోయకొండ గంగమ్మ భక్తులను కటాక్షించనున్నారు.

అమ్మా..గంగమ్మా!

అమ్మా..గంగమ్మా!