
సంఘమిత్ర చేతి వాటం
– రూ.4.9 లక్షలు స్వాహా
వెదురుకుప్పం: ఓ సంఘమిత్ర చేతి వాటాన్ని ప్రదర్శించాడు. గ్రామ సమైఖ్య(వీఓ) ద్వారా పేదలకు అందించే రుణాల్లో గోల్‌మాల్ చేసి రూ.4 లక్షలకుపైగా స్వాహా చేశాడు. ఈ ఘటన సోమవారం వెదురుకుప్పం మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుల కథనం...మండలంలోని తిరుమలయ్యపల్లె పంచాయతీ, సుందరాంగిణిపల్లె ఎస్సీ కాలనీలో ఽసాయి వీఓ పరిధిలో ధనలక్ష్మి, వినాయక, తరుకాణమ్మ, కనకదుర్గ స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. 2014లో పీఓపీ కింద ఎస్సీ, ఎస్టీ మహిళలు ఒక్కో సభ్యురాలికి రూ.40 వేల చొప్పున రుణాలు మంజూరు చేశారు. సాయి వీఓ పరిధిలోని ధనలక్ష్మి, వినాయక, తరుకాణమ్మ, కనకదుర్గ స్వయం సహాయక సంఘాల్లోని కొంత మందికి ఒక్కో మహిళకు రూ.40 వేల చొప్పున రుణాలు మంజూరు చేశారు. ఆ రుణాలను తిరిగి చెల్లించే క్రమంలో సంఘమిత్రగా ఉన్న సుబ్రమణ్యంరెడ్డి తన చేతి వాటాన్ని ప్రదర్శించారు. నెలనెలా సభ్యుల వద్ద వసూలు చేసి బ్యాంకులో జమచేస్తానని నమ్మబలికి రుణాలు స్వాహా చేశాడు. 18 మంది నుంచి రుణాల చెల్లింపు పేరిట వసూలు చేసిన మొత్తాన్ని తన అవరాలకు వాడుకునేశాడు. ధనలక్ష్మి సంఘం నుంచి రూ.44,463, వినాయక సంఘం నుంచి రూ.1,31,850, తురకాణమ్మ సంఘం నుంచి రూ.1,54,449, కనకదుర్గ సంఘం నుంచి రూ.1,59,429 చొప్పున మొత్తం రూ. 4,90,191 వసూలు చేశాడు. తాజాగా స్వయం సహాయక రుణాల కోసం బ్యాంకు వద్ద కు సంఘ సభ్యులు వెళ్లడంతో అసలు విషయం బహిర్గతమైంది. గతంలో తీసుకున్న రుణాలను చెల్లించలేదని చెప్పడంతో అవాక్కయ్యారు. దీంతో సోమవారం వెదురుకుప్పంలో సంఘమిత్రపై చర్యలు తీసుకోవాలంటూ వెదురుకుప్పం ఎస్‌ఐ, వెలుగు ఏపీఎం పరశురామిరెడ్డికి ఫిర్యాదు చేశారు.
సంఘమిత్ర పై విచారణ
సంఘమిత్ర సుబ్రమణ్యం రెడ్డిపై మండల సమైఖ్య కమిటీ ద్వారా విచారణ చేపట్టినట్టు ఏపీఎం పరశురామిరెడ్డి తెలిపారు. సుబ్రమణ్యంరెడ్డి వసూలు చేసిన నగదును తానే వాడుకున్నట్లు ఒప్పుకుని సభ్యుల నుంచి వసూలు చేసిన డబ్బును ఒక నెలలోపు తిరిగి చెల్లిస్తానని వెలుగు కార్యాలయంలో రాత పూర్వకంగా రాసిచ్చారు. కాగా సుబ్రమణ్యంరెడ్డి పై జిల్లా అధికారులకు నివేదికలు అందించి తగు చర్యలు తీసుకుంటామని ఏపీఎ సంఘ సభ్యులకు హామీ ఇచ్చారు.