
తమిళనాడుకు ‘చిత్తూరు లాటరీ’
చిత్తూరు అర్బన్: చిత్తూరులో నిర్వహిస్తున్న నిషేధిత లాటరీ టికెట్ల విక్రయాలు ఇప్పటికే జిల్లా సరిహద్దులు దాటి.. విజయవాడకు వరకు చేరాయి. తాజాగా ఈ లాటరీ టికెట్లను తమిళనాడుకు సైతం పంపుతుండడంతో అక్కడి పోలీసులు చిత్తూరు నగరంపై దృష్టి పెట్టారు. ఈ మేరకు తిరువణ్ణామలై పోలీసులు రెండు రోజుల క్రితం అక్కడ లాటరీలు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పట్టుకుని విచారించారు. తనకు చిత్తూరుకు చెందిన వ్యక్తి లాటరీ టికెట్లు సరఫరా చేస్తున్నాడని సమాచారం ఇచ్చాడు. దీంతో చిత్తూరుకు చెందిన ఓ పంపిణీ దారుడిని తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
సచివాలయంలో ప్రింటర్ చోరీ
వెదురుకుప్పం : మండలంలోని తిరుమలయ్యపల్లె సచివాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రింటర్‌ను చోరీ చేశారు. కార్యదర్శి సోమ వారం ఈమేరకు వెదురుకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సచివాలయ తలుపులకు వేసిన తాళాలను పగులగొట్టి ప్రింటర్‌ను అపహరించినట్లు పేర్కొన్నారు. సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గతంలో ఇదే విధంగా కొమరగుంట, బ్రాహ్మణపల్లె సచివాలయాల్లో ప్రింటర్లు అపహరణకు గురవడం గమనార్హం.
గ్రావెల్ తరలింపుపై ధర్నా
పాలసముద్రం : మండలంలోని వనదుర్గాపురం పంచాయతీ జగనన్న కాలనీ సమీపంలోని గుట్ట ను తవ్వి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న ఘటన పై సోమవారం గ్రామస్తులతో కలిసి సీపీఎం, టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. ఎర్రమట్టిని టిప్పర్లకు లోడ్ చేస్తున్న ప్రాంతంలో నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఇష్టారాజ్యంగా మట్టి తవ్వకాలకు అనుమతిస్తున్నారని మండిపడ్డారు. సుమారు ఐదు నెలలుగా మట్టి యథేచ్ఛగా తమిళనాడుకు తరలి పోతున్నప్పటికీ ఎమ్మెల్యే కనీసం స్పందించడం లేదని ఆరోపించారు. దీనిపై సమాచారం అందుకున్న తహసీల్దార్ అరుణకుమారి వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గ్రామస్తుల ఫిర్యాదును తీసుకున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి మట్టి తరలింపును అడ్డుకుంటామని హామీ ఇచ్చారు.
డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల
తిరుపతి రూరల్: శ్రీపద్మావతీ మహిళా యూనివర్సిటీలో సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ (సీడీఓఈ)లో వివిధ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు వర్సిటీ అధికారులు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. బీఈడీ అడిషనల్ మెథడాలజీ, ఎంకామ్, ఎంఏ తెలుగు, ఎంఏ సంగీతం, డిప్లొమా ఇన్ మ్యూజిక్ (సంకీర్తన), వర్ణం, అన్నమయ్య అంతరంగం కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు www.spmvv.ac.in వెబ్‌సైట్‌ను చూడాలన్నారు.