
ఉచితం.. ఊసే లేదు!
పుత్తూరు: ఉచిత విద్యుత్ అందిస్తామని కేబినెట్‌లో తీర్మానించి, జీఓ విడుదల చేసినప్పటికీ ఎందుకు అమలు చేయడం లేదని పవర్‌లూమ్స్ కార్మికులు మండిపడ్డారు. సోమవారం స్థానిక గేట్‌పుత్తూరులో వందలాది మంది కార్మికులు ఆందోళను దిగారు. ఏపీఎస్పీడీసీఎల్ ఈఈ ఆశీర్వాదానికి వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కారం కోసం స్థానిక వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతలు ఏకమై ప్రభుత్వాన్ని నిలదీయడం విశేషం. కార్మిక నాయకులు మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ నుంచి పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్లు, చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని అమలు చేయడానికి ఈఏడాది మార్చి 16వ తేదీన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారన్నారు. అనంతరం ఆగస్టు 7వ తేదీ నుంచి ఉచిత విద్యుత్‌ను అమలు చేస్తున్నట్లు జీఓ విడుదల చేశారని తెలిపారు. అయితే ఆగస్టులోనూ తాము బిల్లులు చెల్లించామని, ఈ సెప్టెంబర్‌లోనూ మళ్లీ యధావిధిగా విద్యుత్ బిల్లులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము బిల్లులు చెల్లించే పరిస్థితిలో లేమని తేల్చి చెప్పారు. బిల్లులు చెల్లించాలని నిర్భందిస్తే ఆందోళన తప్పదని హెచ్చరించారు. దీనిపై ఈఈ ఆశీర్వాదం మాట్లాడుతూ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని తెలిపారు. కార్మిక సంఘాల నేతలు శంకర్, పొన్నుస్వామి, సురేష్, నాగప్ప, జ్యోతి, సెల్వం, శివ, ఇళయరాజ, పాండియన్, కన్నప్ప, కన్నియప్పన్, అన్నామలై, కుమార్ తదితరులు పాల్గొన్నారు.