అంతా విలవిల! | - | Sakshi
Sakshi News home page

అంతా విలవిల!

Sep 23 2025 9:33 AM | Updated on Sep 23 2025 9:55 AM

అంతా

అంతా విలవిల!

ఆధునిక పోకడలో నేరగాళ్ల

సరికొత్త పంథా

ప్రజల ఏమరుపాటుకు

సాంకేతికత జోడించి వల

నిముషాల్లో రూ.లక్షలు

కోల్పోతున్న బాధితులు

సరికొత్త సవాళ్లలోనూ..

నేరస్తుల కోసం ఖాకీల వేట

నిందితులను పట్టుకున్నా.. రికవరీలో ఇబ్బందులు

సైబర్‌ వల..

● కుప్పంకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి ‘తల్లికివందనం’ డబ్బులు ఇంట్లో పిల్లలందరికీ రావాలంటే కింది లింకుపై క్లిక్‌ చేయమని టెక్ట్స్‌ మెసేజ్‌ వస్తే అలాగే చేశాడు. తీరా తన యూపీఐ ఖాతాలో ఉన్న రూ.32 వేలు పోగొట్టుకున్నాడు.

● ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో ర్యాంకు తెలుసుకోవాలంటే ఫైల్‌ ఓపెన్‌ చేయమని వచ్చిన మెసేజ్‌ను తెరిస్తే.. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ నగరికి చెందిన విద్యావంతుడు రూ.12 వేలు పోగొట్టుకున్నాడు.

చిత్తూరు అర్బన్‌: ఇప్పుడంతా ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌) యుగం. ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని పరిస్థితి. ఆన్‌లైన్‌లో ఆర్థిక నేరాలు చేసేవాళ్లు సైతం ఏఐని ఉపయోగించి సరికొత్త మోసాలకు పాల్పడుతూ రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. మోసం చేసిన వ్యక్తి ఎవరో తెలియదు. ఎక్కడ ఉంటాడో చెప్పలేని పరిస్థితి. ఆడ, మగా కూడా గుర్తించడం వీలుకాదు. కానీ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.లక్షలకు రూ.లక్షలు కొల్లగొట్టేస్తున్నారు. నిందితులను గుర్తించడం, పట్టుకోవడం, పోగొ ట్టుకున్న నగదును రికవరీ చేయడం పోలీసులకు ఓ సవాలుగా మారుతోంది.

రోజూ కొత్తకొత్త నేరాలు

చిత్తూరు జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్లకు ఇటీవల వస్తున్న సైబర్‌ మోసాలు చూస్తుంటే పోలీసులే షాక్‌కు గురవుతున్నారు. అడ్డూ అదుపులేని దురాశ, అనవసరమైన వాటిని క్లిక్‌ చేయడం మోసాలకు ప్రధాన కారణంగా మారుతోందని గ్రహించారు.

మీట నొక్కనంతవరకు సేఫ్‌

వాట్సాప్‌, టెక్ట్స్‌ మెసేజ్‌ల్లో చాలా వరకు ఏపీకే ఫైల్స్‌ వస్తుంటాయి. వీటిని ఏ మాత్రం క్లిక్‌ చేసినా ఖాతాలో డబ్బులు ఖాళీ అవుతాయి. కొందరు లక్కీడిప్‌లో బహుమతి వచ్చిందని సతాయించి డబ్బులు దోచేస్తున్నారు. అనవరసమైన వాటి జోలికి వెళ్లడం, సంబంధంలేని ఫైల్స్‌పై క్లిక్‌ చేయడమే సైబర్‌ నేరం జరగడానికి బీజంగా పడుతోంది.

తమ కంపెనీకి రోజూ 5 స్టార్‌ రేటింగ్‌ ఇస్తే.. రోజూ రెండు కాయిన్ల చొప్పున నెలకు 60 కాయిన్లు ఇస్తామని, ఈ–మెయిల్‌ ఐడీ వేరుగా ఉండాలని చెప్పి ఓ మహిళకు ఆన్‌లైన్‌లో ఆఫర్‌ వచ్చింది. తీరా 600 కాయిన్లు గెలుచుకున్న తనకు రూ.60 వేలు ఇవ్వాలని మహిళ కోరగా, తొలుత రూ.5 వేలు చెల్లించాలని చెప్పారు. ఇలా క్రమంగా ఆమె నుంచి రూ.3.75 లక్షలు కాజేయగా తాలూకా పోలీసులను ఆశ్రయించారు.

చిత్తూరు కలెక్టరేట్‌లో పనిచేసే ఓ ఉద్యోగికి ప్రధాన మంత్రి కిసాన్‌ యోజన పేరిట ఏపీకే ఫైల్‌ వాట్సాప్‌కు వచ్చింది. దీన్ని నలుగురికి ఫార్వర్డ్‌ చేస్తే, బహుమతి వస్తుందని మెసేజ్‌లో ఉంది. తీరా ఫైల్‌ ఓపెన్‌చేస్తే, ఫోన్‌పేలో ఉన్న రూ.1.3 లక్షలు పోగొట్టుకోవడంతో పాటు ఫోన్‌ హ్యాక్‌కు గురైంది.

... పై ఘటనలు మచ్చుకు కొన్ని మాత్రమే. జిల్లాలో నిత్యం పదుల సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. సైబర్‌ నేరగాళ్ల మోసాలకు పలువురు బలైపోతున్నారు. బయటకు చెప్పుకోలేక కొంతమంది నలిగిపోతున్నారు. వీటి కట్టడికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా.. నగదు రికవరీలో ఇబ్బందులు తలెత్తుతుండడంతో బాధితులు తలలు పట్టుకుంటున్నారు. ఒక్క నిమిషం ఆలోచిస్తే ఇలాంటి మోసాలకు తావుండదని పోలీసులు సూచిస్తున్నారు.

అవమానంగా భావిస్తూ.. ఆర్థికంగా చితికిపోతూ..

నగదు పోగొట్టుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని కొందరు మిన్నకుండిపోతున్నారు. కానీ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల పోగొట్టుకున్న నగదు మళ్లీ బ్యాంకు ఖాతాకు తెప్పించడం పోలీసులకే సాధ్యం. సైబర్‌ మోసగాళ్లు విసురుతున్న సరికొత్త సవాళ్లను ఛేదిస్తూ, ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ జిల్లా పోలీసు యంత్రాంగం అండగా నిలుస్తోంది. గత మూడేళ్లల్లో సైబర్‌క్రైమ్‌ ద్వారా పోగొట్టుకున్న దాదాపు రూ.2.16 కోట్ల నగదును బ్యాంకుల్లోనే ఫ్రీజ్‌ చేయగలగడం జిల్లా పోలీసు యంత్రాంగానికే సాధ్యం.

ఒక్క నిమిషం ఆలోచిస్తే

స్మార్ట్‌ ఫోన్ల వాడకంలో ఏది అవసరం..? ఏది అనవసరం..? అని రెండే ప్రశ్నలు వేసుకుంటే సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేసి నట్టే. ఏదో గిఫ్ట్‌ వచ్చిందని, స్టాక్‌ మార్కెట్‌లో వారానికి రూ.లక్ష సంపాదించొచ్చని రకరకాలుగా మోసాలు చేస్తున్నారు. ఒక్క నిమిషం మనం ఏం చేస్తున్నామో ఆలోచిస్తే అసలు నేరం జరగదు. సైబర్‌ నేరాలపై జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రతి రోజూ అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ఒకవేళ ఎవరైనా మోసపోయినా పరువుపోతుందని భయపడొద్దు. వెంటనే సైబర్‌ హెల్ప్‌లైన్‌–1930, ఫోన్‌–9440900005, 9121211100 నెంబర్లకు ఫోన్‌చేస్తే పోగొట్టుకున్న డబ్బును తిరిగి తీసుకురావడం సాధ్యమవుతుంది.

– తుషార్‌ డూడీ, ఎస్పీ, చిత్తూరు

అంతా విలవిల!1
1/1

అంతా విలవిల!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement