
ఎక్స్‌ప్రెస్ హైవే అధికారుల నిర్లక్ష్యం
గుడిపాల: మండల కేంద్రమైన గుడిపాల మీదుగా చైన్నె– బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే వెళుతోంది. ఈ రోడ్డు నిర్మాణంలో భాగంగా చాలా ప్రాంతాల్లో చెరువు కట్టలు, మొరవలను ధ్వంసం చేశారు. తర్వాత వాటికి మరమ్మతులు చేయకపోవడంతో వర్షపు నీరు చెరువుల్లోకి వెళ్లకుండా గ్రామాల్లోకి చేరుతోంది. కొన్ని ప్రాంతాల్లో పొలాల్లోకి చేరుతుండడంతో పంటలు మునిగిపోతున్నాయి. ముఖ్యంగా గుడిపాల మండలంలోని బంగారక్క చెరువు కట్ట మట్టిని తొలగించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెరువులోకి నీరు చేరుతోందని, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని చుట్టుపక్కల గ్రామస్తులు భయపడుతున్నారు. అలాగే మొరవను కూడా కొట్టివేశారు. దీంతో పాటు పశుమంద చెరువు, సుబ్బారెడ్డి చెరువు, చలిచీమలపల్లె చెరువుల కట్టలు, వాగులను ఎక్కడపడితే అక్కడ తవ్వేయడంతో వర్షపు నీరు ఇళ్లలోకి వస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.