
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
చిత్తూరు కలెక్టరేట్ : దివ్యాంగులు అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా సమగ్రశిక్షా శాఖ ఏపీసీ వెంకటరమణ అన్నారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ పాఠశాలలో దివ్యాంగులకు అసెస్‌మెంట్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏపీసీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దివ్యాంగులు వికలత్వంపై కుంగిపోకూడదని, దివ్యాంగులుగా ఉంటూ ఎంతోమంది ఉన్నత పదవులు, ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో అసెస్‌మెంట్ క్యాంప్‌లు నిర్వహించినట్లు తెలిపారు. చిత్తూరులో నిర్వహించిన ఐదవ క్యాంప్‌లో 50 మంది దివ్యాంగ విద్యార్థులకు వైద్యులు అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహించారన్నారు. ఈ నెల 22వ తేదీన గంగాధరనెల్లూరు ప్రాథమిక పాఠశాలలో ఆరవ అసెస్‌మెంట్ క్యాంప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చుడా చైర్మన్ హేమలత, బీజేపీ నాయకులు అట్లూరి శ్రీనివాసులు, ఎంఈఓలు మోహన్, హసన్‌బాషా తదితరులు పాల్గొన్నారు.