
బడబళ్లవంక ప్రాజెక్టు తూముకు గండి
రొంపిచెర్ల: రొంపిచెర్ల–పులిచెర్ల మండలాల సరిహద్దులో ఉన్న బడబళ్లవంక ప్రాజెక్టు తూముకు శనివారం గండి పడింది. ఈ ప్రాజెక్టును గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో రూ.34.57 కోట్లతో నిర్మించారు. కాలువ పనులను సైతం 80 శాతం పూర్తి చేశారు. దీని నుంచి 4 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ క్రమంలో ప్రాజెక్టు తూముకు శనివారం రాత్రి గండి పడింది. ఆదివారం ఉదయం నీరు వృథాగా పోతున్న విషయాన్ని గుర్తించిన స్థానికులు రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. తహసీల్దార్ అమరనాథ్, ఇరిగేషన్ ఏఈ మునిశేఖర్, ఎస్‌ఐ సుబ్బారెడ్డి అక్కడికి చేరుకుని పరిశీలించి రైతులతో మాట్లాడారు. శనివారం రాత్రి 9, 11 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం వచ్చిందని తెలిపారు. ప్రాజెక్టు తూము వద్ద పేల్చినట్లు గానీ, పగులగొట్టిన ఆనవాళ్లు కనిపించలేదని, తూముకు అమర్చిన బండ పగలడం వల్ల శబ్దం వచ్చి ఉండవచ్చని అధికారులు చెప్పారు.
మునిగిన 20 వ్యవసాయ మోటార్లు
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు బడబళ్లవంక ప్రాజెక్టు 70 శాతం మేర నిండింది. మూడు అడుగుల ఎత్తు నీరు వస్తే ప్రాజెక్టు మొరవపోయే అవకాశం ఉంది. దీంతో ముంపు భూముల్లో ఉన్న 20 వ్యవసాయ బోరు మోటార్లు మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో మోటార్లను బయటకు తీసుకునేందుకు తూమును పగులగొట్టారా? లేక పరిహారం మంజూరు కాకపోవడంతో ఆగ్రహంతో తూము బండను పగులగొట్టారా? అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బడబళ్లవంక ప్రాజెక్టు తూముకు గండి