
డ్రోన్ సహాయంతో ఏనుగుల గుర్తింపు
పులిచెర్ల(కల్లూరు) : ఏనుగుల ఉంటున్న, తిరుగుతున్న ప్రదేశాలను డ్రోన్ ద్వారా గుర్తించి చర్యలు తీసుకుంటామని చిత్తూరు డీఎఫ్‌ఓ సుబ్బరాజు తెలిపారు. ఆదివారం ఆయన సిబ్బందితో కలిసి కల్లూరుపాళెం సమీపంలోని జూపల్లె బండ వద్ద డ్రోన్ల సాయంతో ఏనుగుల స్థావరాలను పరిశీలించారు. గత సంవత్సర కాలంగా ఈ ఏనుగుల గుంపు మండలంలోనే తిరుగుతూ పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. ఎన్ని చర్యలు తీసుకున్నా బయటకు పోవడం లేదు. ఇక్కడే ఉంటూ రోజూ ఏదో ఒక ప్రాంతంలో పొలాలపై పడి పంట నాశనం చేస్తున్నాయని క్షేత్రస్థాయి అటవీ అధికారులు వివరించారు. దీనిపై డీఎఫ్‌ఓ స్పందిస్తూ ఏనుగుల కట్టడికి చర్యలు తీసుకుంటామని, సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండి ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణహాని కలుగకుండా చూడాలని ఆదేశించారు. తమకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వో థామస్ సుకుమార్, ఎఫ్‌ఎస్‌ఓ మహమ్మద్‌షఫీ, ఎఫ్‌బీఓ మధు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
పంటపొలాలపై ఏనుగుల దాడి
పులిచెర్ల(కల్లూరు) : పులిచెర్ల మండలంలోని దేవళంపేట, దిగువ మూర్తివారిపల్లె, జూపల్లె, కోటపల్లె, వీకే పల్లె, కుమ్మరపల్లె తదితర గ్రామాల్లో రైతులు సాగు చేసిన ఆదివారం పంటలను నాశనం చేశాయి. మరో ఏనుగుల గుంపు పాతపేట, తలారివారిపల్లె, ఎద్దులవారిపల్లె గ్రామాల్లో సంచరిస్తూ పంటలపై దాడి చేసి నష్టం కలిగించాయి. అలాగే జూపల్లెలో సుబ్బ రత్నం, దేవళంపేటలో సుధాకర్, ప్రభాకర్, బసవరాజు పొలాల్లోని మామిడి, వరి పంటలను తొక్కి నాశనం చేశాయి. ఎక్కువగా వరిపంటలను నేల తొక్కి పారేవాయి. మండలంలో ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట ఏనుగులు దాడులు చేస్తూ అన్నదాతలకు నష్టం కలిగిస్తున్నాయి. వీటిని కట్టడి చేయకపోతే పంటలను సాగు చేసుకునే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.
వివాహిత అదృశ్యంపై ఫిర్యాదు
బంగారుపాళెం: మండలంలోని కీరమంద గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య కనిపించడం లేదని ఆదివారం రాత్రి ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన ఓ వివాహిత ఉదయం బంగారుపాళెం ఆస్పత్రికి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో ఆమె భర్త పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మైనర్ బాలిక అదృశ్యం..
మండలంలోని మొగిలివెంకటగిరి గ్రామానికి చెందిన ఓ మైనర్‌బాలిక అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఉదయం నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.