
విద్యార్థిని అదృశ్యం కేసులో ముగ్గురి అరెస్టు
పుత్తూరు: గత ఆగస్టు 23వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయిన ఇంటర్ విద్యార్థిని అదృశ్యం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్‌ఐ ఓబయ్య కథనం మేరకు.. గేట్‌పుత్తూరుకు చెందిన జోషువ లారెన్స్, అనుప్రియ దంపతుల కుమార్తె జె.యోషిని(17) పుత్తూరులోని ప్రభుత్వ బాలికల కళాశాలలో ఇంటర్మీడియెట్ తొలి ఏడాది చదువుతోంది. గత నెల 23వ తేదీన తన కుమార్తె యోషిని కనిపించడం లేదని, గేట్‌పుత్తూరు వీవర్స్ కాలనీకి చెందిన శరవణన్ కుమారుడు జ్యోతిప్రసాద్ తన కుమార్తెను తీసుకెళ్లి ఉంటాడని అనుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 14వ తేదీ సాయంత్రం యోషిని తన తల్లి అనుప్రియతో పోలీస్ స్టేషన్‌కు వచ్చి వాంగ్మూలం ఇచ్చింది. యోషిని చెప్పిన వివరాల మేరకు.. గేట్‌పుత్తూరుకు చెందిన జ్యోతిప్రసాద్ తనను మోసపూరిత మాటలతో నమ్మించి, తమిళనాడులోని రెడ్‌హిల్స్‌లోని మదన్‌కుమార్, మల్లిక ఇంటిలో నిర్బంధించాడని తెలిపింది. వీరికి ప్రేమలత అనే మరో మహిళ సహాయం చేసినట్లు చెప్పింది. 20 రోజులపాటు నిర్బంధించిన జ్యోతిప్రసాద్ తన నోట్లో గుడ్డలు కుక్కి, పలుమార్లు లైంగిక దాడి చేశాడని వెల్లడించింది. రెడ్‌హిల్స్‌లోని వినాయకుడి ఆలయంలో బలవంతంగా వివాహం చేసుకున్నాడని తెలిపింది. పుత్తూరులో పోలీసు కేసు నమోదు అయిందన్న విషయం తెలుసుకున్న జ్యోతిప్రసాద్ ఈ నెల 14వ తేదీన పుత్తూరు–నారాయణవనం జంక్షన్ వద్ద తనను వదలిపెట్టి వెళ్లిపోయాడని వెల్లడించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పుత్తూరు పోలీసులు ఏ1 జ్యోతిప్రసాద్, ఏ2 ప్రేమలత, ఏ4 మల్లికను ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏ3 మదన్‌కుమార్ పరారీలో ఉన్నాడు.