
కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్పీ తుషార్ డూడి కలెక్టర్‌ను కలిశారు. ఈ మేరకు శనివారం ఆయన కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీని మర్యాద పూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అనంతరం జిల్లాలో శాంతిభద్రతలకు సంబంధించి చేపట్టాల్సిన పలు అంశాలపై కలెక్టర్‌తో చర్చించారు.
రేపటి నుంచి దసరా సెలవులు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈనెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటిస్తున్నట్లు డీఈవో వరలక్ష్మి వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు(మైనారిటీ పాఠశాలలు తప్ప) కచ్చితంగా దసరా సెలవులను అమలు చేయాలన్నారు. సెలవుల్లో ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించరాదన్నారు. జిల్లాలోని మైనారిటీ పాఠశాలలకు ఈనెల 27 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపారు. జిల్లాలోని డీవైఈవోలు, ఎంఈవోలు ప్రైవేట్ పాఠశాలల్లో తరగతులు నిర్వహించకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని డీఈవో ఆదేశించారు.
పీహెచ్‌సీల్లో మెరుగైన వైద్యం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రతి పీహెచ్‌సీలో ప్రజలకు మెరుగైన వైద్యం అందజేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ ఆదేశించారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో వైద్యఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ హైరిస్క్ గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అన్ని కాన్పులు ఆస్పత్రుల్లోనే జరిగేలా శ్రద్ధ వహించాలన్నారు. గర్భిణులకు తప్పనిసరిగా అభ ఐడీ నమోదు చేయాలని చెప్పారు. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకంలో మొదటి కాన్పులో ఇద్దరు ఆడ పిల్లలకు రూ.6 వేలు తప్పక అందించాలన్నారు. పీహెచ్‌సీ డాక్టర్‌లు విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ సుధారాణి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ పద్మాంజలి, వైద్యాధికారులు వెంకటప్రసాద్, హనుమంతరావు, అర్పిత పాల్గొన్నారు.
ప్రజల ప్రాణాలు గాలికి
పాలసముద్రం: కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాలికొదిలేసిందని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలతో ప్రజలు విలవిల్లాడుతున్నా, కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. ఇదే తరుణంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. జగనన్న 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే, చంద్రబాబు తన 15 ఏళ్ల పాలనలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. పేదవాడికి వైద్యం అందకుండా చేయాలనే కుట్ర పన్నుతున్నట్టు ఉందని చెప్పారు. సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రూ.8 వేల కోట్ల విలువ చేసే 17 మెడికల్ కాలేజీలను తన బినామీలకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు.
విధులు బాధ్యతగా నిర్వహించాలి
చిత్తూరు కలెక్టరేట్ : టీచర్లు తమ విధులను బాధ్యతగా నిర్వహించాలని డీఈవో వరలక్ష్మి ఆదేశించారు. ఆమె శనివారం సంతపేటలో ఉన్న పీఎన్‌సీ మున్సిపల్ పాఠశాలలో నిర్వహించిన సీఆర్‌సీ సమావేశాన్ని తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ ప్రతి ఉపాధ్యాయుడు విద్యలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించి పబ్లిక్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలన్నారు. 100 శాతం ఉత్తీర్ణతకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ

కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ

కలెక్టర్‌ను కలిసిన నూతన ఎస్పీ