
విద్యతోనే మెరుగైన జీవితం
గుడిపాల: విద్య ద్వారా మెరుగైన జీవన విధానం పొందవచ్చని, ప్రతి గిరిజన కుటుంబంలోని పిల్లలందర్నీ బడికి పంపించి చదివించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ పిలుపునిచ్చారు. శనివారం గుడిపాల పరిధిలోని అనుపు ఎస్టీ కాలనీలో స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఓ మొక్కను నాటారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మండల స్థాయి అధికారులతో కలిసి గ్రామసభను నిర్వహించారు. గిరిజనుల స్థితిగతులు మార్పు చెందాలంటే వారి పిల్లలను కచ్చితంగా బడికి పంపించాలన్నారు. విద్య ద్వారానే ఉపాధి పొందవచ్చని చెప్పారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలతో వృద్ధి చెందాలన్నారు. కాలనీవాసులు తమకు పక్కా ఇళ్లు కావాలని కోరగా రెండు వారాల్లో చర్యలు చేపట్టాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. తహసీల్దార్, స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి శ్మశాన వాటిక దారి సమస్యను తీర్చడానికి త్వరలో సర్వే బృందాన్ని పంపుతామని హామీ ఇచ్చారు. తమిళనాడు నుంచి వచ్చిన వలసదారులకు వెంటనే ఆధార్ కార్డులు వచ్చేలా చర్యలు చేపడుతామన్నారు. చదువుకున్న యువతకు అమరరాజా ఫ్యాక్టరీలో శిక్షణ ఇప్పించి, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఆడపిల్లలు కంప్యూటర్ విద్యకు సంబంధించి నైపుణ్య శిక్షణ పొందాలని, అందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని పునరుద్ధరించి బాగు చేస్తామన్నారు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో కుమార్, డ్వామా ఏపీడీ సుబ్రమణ్యం, ఎంఈఓ హసన్‌బాషా, వ్యవసాయాధికారి సంగీత, డాక్టర్ సంధ్య, ఏఈలు ప్రసాద్, పవన్, శివకుమార్ పాల్గొన్నారు.