
మూగ నేస్తం.. అందని వైద్యం
పాడి పశువులకు వైద్యం కరువు మధ్యాహ్ననికే ఆస్పత్రులకు తాళం ఆపై నకిలీ డాక్టర్లదే రాజ్యం వికటిస్తున్న వైద్యం
మందులు పక్కదారి..?
మూగ జీవుల వైద్యంపై ప్రభుత్వ వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వ్యాధులు సోకితే సరైన చికిత్స అందక పాడి పశువులు అల్లాడుతున్నాయి. వాటికి వైద్యం అందించలేక పాడి రైతులు ఆవేదన చెందుతున్నారు. జీవనోపాధి కోసం పోషిస్తున్న పాడి పశువులు వ్యాధులతో బాధపడుతుంటే చూడలేక పశుపోషకులు ప్రైవేటు వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రైవేటు వైద్యులకు రూ.వేలల్లో ఫీజులు ముట్టజెప్పినా ఫలితం లేకపోపోతోంది. ఫలితంగా పశు సంపదకు నష్టం వాటిల్లి, పాడి పరిశ్రమ దెబ్బతింటోంది. పాడి రైతులు జీవనోపాధి కోల్పోవాల్సిన దుస్థితి నెలకొంటోంది.
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పశువులకు ఉచిత వైద్యం కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న మందులు పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వ మందులను ప్రైవేటు వ్యక్తులు అమ్ముకుని, సొమ్ము చేసుకుంటున్నారు. రోగ నిర్ధారణ పరీక్షలు చేయడం మానేశారు. పాడి రైతులు తమ పశువులను ఆస్పత్రులకు తీసుకు వచ్చినా మందుల్లేవని, బయట కొనుగోలు చేసుకోమని, చీటీలు రాసి ఇచ్చి, కమీషన్లు కొట్టేస్తున్నారు.
పాడి పరిశ్రమే ఆధారం
జిల్లాలో పాడి పరిశ్రమపై ఆధారపడి సుమారు 3 లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. పాడి పోషణ ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాలను నడుపుతున్నాయి. గత ఐదేళ్ల కాలంలో ఈ పాడి పరిశ్రమ మరింత వృద్ధి చెందింది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 1,036 గేదెలు, 4.67 లక్షల పాడి ఆవులున్నాయి. వీటి ద్వారా 18 లక్షల నుంచి 20 లక్షల వరకు పాలసేకరణ జరుగుతోంది. తద్వారా వచ్చే ఆదాయంతోనే లక్షలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. అయితే పాడి పశువులకు వ్యాధులు వస్తే నయం చేసుకోవడానికి రైతులు సొమ్మసిల్లిపోతున్నారు.
పశు వైద్యం కరవు
జిల్లాలో జిల్లా పశువుల ఆస్పత్రి, ఏరియా పశు వైద్యశాలలు, వెటర్నరీ డిస్పెన్సరీ వైద్యశాలలు, రూరల్ లైఫ్‌స్టాక్ యూనిట్లు, రైతు భరోసా కేంద్రాలు 455 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో మండల పశు వైద్యాధికారులు 68 మంది, ఏడీలు 14, ఏహెచ్‌ఏలు 282 మంది, గోపాలమిత్రలు 114 మంది ఉన్నారు. అయితే కొందరి వైద్యుల అలసత్వం, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వెరసి పశువైద్యానికి సుస్తీ చేసింది. ఉదయం 9, 10 గంటలకు వచ్చి 11 గంటలు, మధ్యాహ్నం 1 గంటకు ఆస్పత్రులకు తాళం వేసి వెళ్లిపోతున్నారు. లేకుంటే సిబ్బందిని ఆస్పత్రికి కాపాలా పెట్టి వెళ్లిపోతున్నారు. దీంతో పశువైద్యం పూర్తిగా కొరవడుతోంది. పాడి రైతులు పశువులకు ఉచిత వైద్యం కోసం నానా తిప్పలు పడుతున్నారు.
ప్రైవేటు వైద్యమే దిక్కు...
జిల్లాలో పలు చోట్ల పశుపోషకులకు ప్రైవేటు వైద్యులే దిక్కుగా మారుతున్నారు. మధ్యాహ్నం పైగా ప్రభుత్వ వైద్యం వారికి పూర్తిగా అందడం లేదు. వైద్యులు మీటింగ్ పేరుతో విధులకు డుమ్మా కొడుతున్నారు. పశువులకు జబ్బు చేస్తే రైతులు ప్రైవేటు డాక్టర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. లేకుంటే వాళ్లకు ఫోన్ చేసి ఇంటి వద్దకు రప్పించుకుంటున్నారు. వారి ద్వారా పశు వైద్య సేవలు పొందుతూ రూ.వేలల్లో ఫీజులు చెల్లించుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో వీహెచ్‌ఏలు కూడా స్పందించడం లేదని పలువురు పాడి రైతులు వాపోతున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగా నకిలీ డాక్టర్లు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నారు. ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది రావడం లేదని రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నకిలీ వైద్యులతో తంటాలు..
జిల్లాలో పాడి పశువులకు మంచి గిరాకీ ఉంది. ఈ క్రమంలో ఒక్కొక్క ఆవు రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు పలుకుతోంది. అంత ధర పెట్టి కొనుగోలు చేసిన పశువులకు వైద్యం సక్రమంగా అందడం లేదు. కొందరు నకిలీ కేటుగాళ్లు ఎలాంటి అర్హత లేకుండా పాడి ఆవులకు వైద్యం చేస్తున్నారు. విచ్చలవిడిగా యాంటీ బయోటిక్స్ వాడేస్తున్నారు. దీంతో పాడి పశువుల్లో సంతానోత్పత్తి దెబ్బతింటోంది. విద్యార్హత లేని వ్యక్తులు సైతం పశు వైద్యులుగా చలామణి అవుతూ పాడి పశు సంపదను నాశనం చేస్తున్నారు. ఈ విష యం తెలియని తాము ఆర్థికంగా నష్టపోతున్నామని పాడి రైతులు కంట తడిపెడుతున్నారు.
జిల్లా సమాచారం
జిల్లా పశువుల ఆస్పత్రి 1
ఏరియా పశు వైద్యశాలలు 14
వెటర్నరీ డిస్పెన్సరీ వైద్యశాలలు 68
రూరల్ లైఫ్ స్టాక్ యూనిట్లు 75
రైతు భరోసా కేంద్రాలు 297
పాడి ఆవులు 4.67 లక్షలు
గేదెలు 1036
కొంత మంది వైద్యులు మధ్యాహ్ననానికే ఇంటి బాట పట్టడంతో ప్రైవేటు, నకిలీ డాక్టర్లకు చేతి నిండా పనిపడుతోంది. నకిలీ వైద్యులు కొందరు ప్రభుత్వ వైద్యులతో చేతులు కలిపి, ప్రభుత్వ పశు వైద్యశాలలు, కేంద్రాలకు సరఫరా చేసే మందులను విచ్చలవిడిగా దారి మళ్లిస్తున్నారు. ప్రైవే టు వ్యక్తులు ఏ మందు కావాలన్నా ప్రభుత్వ పశు వైద్య కేంద్రాల నుంచే పట్టుకెళుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ మందులను ప్రైవేటు షాపుల్లో తీసుకొచ్చామని రైతులు దగ్గర డబ్బులు గుంజేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గర్భకోశవ్యాధుల నివారణ మందులు, లివర్ సిరఫ్, కాల్షియం, జ్వరం మాత్రలు, పారుడురోగ నివారణ మందులు, నట్టల నివారణ, కడుపు ఉబ్బరం మందులు అధికంగా దారిమళ్లుతున్నట్లు సిబ్బందే ఆరోపిస్తున్నారు. ఉచితంగా వేయాల్సిన టీకాలను కూడా డబ్బులకు అమ్మేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ప్రైవేటు వైద్యుల నుంచి ప్రభుత్వ వైద్యాధికారులకు వాటాలు వెళుతున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో వైద్యులు మందులు, మాత్రలు ఇక్కడ లేవని, బయట కొనుగోలు చేసుకోమని చీటీలు రాయిస్తున్నారు. ఈ వ్యవహారం అందరికీ తెలిసినా ఏమి తెలియనట్లు వ్యవహరించడంపై విమర్శలకు దారితీస్తోంది.

మూగ నేస్తం.. అందని వైద్యం