
తాళంబేడులో ఆగని టీడీపీ రగడ
సాక్షి టాస్క్‌ఫోర్స్: చిత్తూరు మండలం, తాళంబేడు పంచాయతీలో టీడీపీ నేతల మధ్య రేగిన రగడ ఆగనంటోంది. మండల నేతలు పంచాయితీ చేసినా మళ్లీ వివాదం తెరపైకి వచ్చింది. ఓ నేత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మొదటికొచ్చింది.
రగడ ఏంటంటే?
తాళంబేడులోని ఓ టీడీపీ నేత మద్యం విక్రయిస్తున్నారని ఇద్దరు నేతలు ప్రొబిషన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో గొడవ మొదలైంది. ఈ ఫిర్యాదు ఆ ఇద్దరు నేతలే చేశారని మద్యం విక్రయిస్తూ ఆపేసిన నేత చెవిలో పడింది. ఆ నేత వాళ్లకు సంబంధించిన గోకులం షెడ్డు, అంగన్‌వాడీ ఇతరాత్ర వాటిపై ఫిర్యాదు చేయడంతో వివాదం తారస్థాయికి చేరింది. చివరకు పోలీస్ స్టేషన్‌కు కూడా చేరింది. గురువారం బీఎన్‌ఆర్‌పేటలో ఇరువర్గాల నేతలను పిలిచి మండల నేతలు పంచాయితీ చేశారు. సర్దుబాటు చేశామని మండల నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ లోపు మళ్లీ ఆ ఇద్దరిలో ఓ నేత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యవ్వారం మళ్లీ మొదటికొచ్చింది. మూడు రోజుల తర్వాత మళ్లీ పంచాయితీకి ఫిక్స్ నిర్వహించేందుకు మండల నేతలు ఖరారు చేశారు. కాగా ఇదంతా ఓ మండల నేత నడిపిస్తున్నారని టీడీపీ నేతలు భావిస్తున్నారు.
నేనొక్కడినే
బెంగళూరులో స్థిరపడిన నేతే ఎన్నికల సమయంలో పంచాయతీలో టీడీపీని గటెక్కించేందుకు సాయశక్తుల కృషి చేశారని పలువురు టీడీపీ నాయకులు అంటున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టారని చెబుతున్నారు. కూటమి అధికారంలోకి రావడంతో మంగాపురంలోని మరో నేత పంచాయతీలో పెత్తనం చలాయిస్తున్నారని ఓ వర్గం మండిపడుతోంది. వర్క్‌లు, సిబ్బందిపై పెత్తనం.. ఇలా అన్నింటిలోనూ అన్నీ తానై తలదూరుస్తున్నారని ఆ వర్గం ఆగ్రహానికి గురవుతోంది. ఎన్నికల సమయంలో లక్షలాది రూపాయలు తామే ఖర్చు చేస్తే.. తళుక్కుమనే వారికి పెత్తనం ఇస్తే ఎలా అని మండిపడుతోంది. ఎన్నికల రోజు తలదాచుకున్న వ్యక్తులు, జేబులో నుంచి రూపాయి ఎత్తని వ్యక్తులు ఈ రోజు పంచాయతీలో తామే నాయకులమని చెబితే ఎలా అని ఆ వర్గం ప్రశ్నిస్తోంది. కాగా బెంగళూరులో ఉండే వాళ్లు.. ఇక్కడేమి రాజకీయం చేస్తారని మరో వర్గం దీటుగా సమాధానం ఇస్తోంది. ఇంతకీ ఈ పోరులో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి మరీ.
పల్లె పోరు ఎఫెక్ట్
ఈ వివాదం వెనుక పల్లెపోరు ఎఫెక్ట్ ఉందని పలువురు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇదివరకు ఇద్దరు మండల నేతలు మాత్రం జెడ్పీటీసీకి పోటీపడేవారు. పల్లె పోరు జనవరి ఉండడంతో మరో కొత్త నేతను ఆ పార్టీలోని కొందరు తెరపైకి తీసుకొచ్చారు. తాళంబేడు పంచాయతీ, మంగాపురానికి చెందిన ఆ నేత బెంగళూరులో స్థిరపడ్డారు. ఆర్థికంగా మంచి పలుకుపడి ఉంది. పంచాయతీని బాగానే లీడ్ చేస్తున్నారు. ఈ నేత కూడా జెడ్పీటీసీ టిక్కెట్టు ఆశిస్తున్నారని ఓ మండల నేత చెవిలో పడింది. ఈ వివాదాన్ని అదునుగా తీసుకుని సదరు మండల నేత తాళంబేడు పంచాయతీలో ఆ వర్గాన్ని తొక్కే ప్రయత్నంలో పడ్డారని వారు చెబుతున్నారు. కొత్త అభ్యర్థిగా తెరపైకి వచ్చిన నేత మద్దతు మద్యం విక్రయిస్తూ ఆపేసిన నేతకు ఉంది. దీంతో మద్యం ఆపేసిన నేతకు పోలీసుల ద్వారా ఆ మండల నేత ద్వారా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరుగుతోందనే విమర్శలు వస్తున్నాయి. జెడ్పీటీసీ అభ్యర్థిగా కొత్త నేతను తెరపైకి తీసుకోరావడం వెనుక పంచాయతీలోని ఇద్దరు నేతల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం విక్రయిస్తూ ఆపేసిన నేతను పంచాయతీలో నామరూపాలు లేకుండా చేయాలని ఆ మండల నేతను ఉసిగొలిపి ఇదంతా చేయిస్తున్నారనే ప్రచారం ఉంది.