
క్రమబద్ధకం
అనుమతిలేని లే–అవుట్లపై అనాసక్తి పట్టణాల్లో పర్లేదు.. పల్లెల్లో అవగాహన శూన్యం ప్రజలకు వద్దకు వెళ్లి వివరించలేకున్న యంత్రాంగం లే–అవుట్ల క్రమబద్ధీకరణకు ఆదరణ కరువు
చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున కొత్త లేఅవుట్లు వెలుస్తున్నాయి. సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారంతా వీటిలో అవగాహన లేకుండా ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి వాటిని క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అవగాహన లేని ప్లాట్ల యజమానులకు అవగాహన కల్పించి, స్థలాలను క్రమబద్ధీకరించాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా అటు ప్లాట్ల యజమానులకు నష్టం కలుగుతుండగా, ఇటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.
చిత్తూరు అర్బన్: అనుమతి లేకుండా వెలసిన లే–అవుట్లలో స్థలాల క్రమబద్ధీకరణ పథకంపై ప్రజల్లో ఆదరణ కరవు అయ్యింది. ప్రజలకు మేలు చేయా లని తీసుకొచ్చిన లే–అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్)పై అవగాహన కల్పించడంలో యంత్రాంగం స్తబ్దుగా ఉంది. ప్రిన్స్‌పల్ కార్యదర్శి నుంచి మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ వరకు ఎల్‌ఆర్‌ఎస్‌పై చొరవ చూపడంలేదని, వేగం పెంచాలని పదే పదే వీడియో కాన్ఫరెన్సుల్లో ఆదేశిస్తున్నా యంత్రాంగం దానిపై పెద్దగా దృష్టి సారించడంలేదు. పట్టణాల్లో సచివాలయా సిబ్బంది, మున్సిపల్ అధికారులు ఎల్‌ఆర్‌ఎస్‌పై వేగం పెంచితే తప్ప.. ఇది కదిలేలా కనిపించడంలేదు. పల్లెల్లో అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు (యూడీఏ) దీనిపై పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేయడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం రావాలంటే అధికారులు అడుగుబయట పెట్టాల్సిందే.
చెబుతున్నారా..?
ఎల్‌ఆర్‌ఎస్ పథకంలో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను సులువుగా తీర్చే అవకాశం ఉంది. ప్రధానంగా పట్టణాల్లో అనుమతి లేని లే–అవుట్లలో అధికారులు ప్లాన్ అప్రూవల్స్ ఇవ్వకపోవడంతో ఇళ్లు కట్టడానికి వీల్లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది జూన్ 6వ తేదీ వరకు ఎక్కడైతే అనుమతుల్లేకుండా లే–అవుట్లు వేశారో, వాళ్లంతా కూడా ఎల్‌ఆర్‌ఎస్ పరిధిలోకి వస్తారు. ఇదే సమయంలో నిర్ణీత తేదీలోపు సంబంధిత ఎల్‌ఆర్‌ఎస్‌లో ఒక్క ప్లాటయినా విక్రయించి ఉండాలి. దీనికి సంబంధించి రిజిస్ట్రర్ పత్రాలు తప్పనిసరి. ప్రభుత్వం సూచించిన తేదీకన్నా పదేళ్లు, ఇరవై ఏళ్ల క్రితం ఉన్న లే–అవుట్లను సైతం ఈ పథకంలో క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉంది. జిల్లాలో చిత్తూరు కార్పొరేషన్‌లో 33, పలమనేరులో 18, పుంగనూరులో 15, కుప్పంలో 6, నగరిలో 12 వరకు అనుమతుల్లేని లే–అవుట్లు ఉన్నాయి. వీటి ద్వారా ఆయా మున్సిపాలిటీలకు రూ.కోట్లలో ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కానీ చాలా చోట్ల అధికారులు దీనిపై సరైన అవగాహన కూడా కల్పించడంలేదు.
రూ.4 కోట్లకు పైగా ఆదాయం
ఓపెన్ ప్రాంతంలో 14 శాతం ఫీజులు చెల్లించి, మార్కెట్ విలువలో 10–30 శాతం వరకు అపరాధ రుసుము చెల్లిస్తే ప్రతి ప్లాటును క్రమబద్ధీకరించుకోవచ్చు. గతనెల 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో పోర్టల్ అందుబాటులోకి వచ్చినా.. దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య వంద కూడా దాటలేదు. జిల్లాలోని కార్పొరేషన్, నాలుగు మున్సిపాలిటీల్లో 1700 వరకు ప్లాట్లు క్రమబద్ధీకరించుకోవాల్సి ఉండగా.. వీటి ద్వారా దాదాపు రూ.4.50 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సరైన ధ్రువీకరణ పత్రాలను లైసెన్డ్ ఇంజినీరు, సర్వేయర్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే.. అన్ని సక్రమంగా ఉంటే మూడు రోజుల్లో ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణ అనుమతులు మంజూరవుతాయి. అక్టోబర్ నెలాఖరుకు ఈ పథకానికి గడువు ముగియనుంది. కానీ చాలాచోట్ల యంత్రాంగం కాలు కదపడంలేదు.
గ్రామాల్లో దారుణం..
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కాకుండా.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉపయోగించుకోవచ్చు. చిత్తూరు పరిసరాల్లోని గ్రామాలు చుడా ద్వారా అనుమతులు పొందచ్చు. అలాగే పలమనేరు, కుప్పం, నగరి డివిజన్లలో అక్కడున్న అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల ద్వారా ఎల్‌ఆర్‌ఎస్‌లో ప్లాట్లు క్రమబద్ధీకరించుకోవాలి. కానీ చాలా గ్రామాల్లో యూడీఏ అధికారులు కనీస అవగాహన కల్పించడంలేదనే విమర్శలున్నాయి.