చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు, రైతులు పీఎం ఎఫ్‌ఎంఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ(పీఎంఎఫ్‌ఎంఈ) పథకం స్వయం సహాయక సంఘాల సభ్యులు, రైతులకు వరంలాంటిదన్నారు. ఈ పథకం సంఘ సభ్యులు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి దోహదం చేస్తుందన్నారు. వ్యవసాయం, అనుబంధ శాఖలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారానికి అన్ని విధాలుగా తోడ్పాటు అందించి, ఆధునిక సాంకేతికతతో సంఘటిత రంగాల్లో వ్యాపారులుగా నిలబెట్టడమే ప్రధాన లక్ష్యమన్నారు. జిల్లా టమాట, మామిడి, బెల్లం, జామ తదితర ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతమని చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న తరహా పరిశ్రమ ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు రావాలన్నారు. ఈ పథకం ఆధ్వర్యంలో యూనిట్ వ్యయంలో లబ్ధిదారుల వాటా 10 శాతం పెట్టుబడిగా పెడితే ప్రభుత్వం బ్యాంకు రూపంలో 90 శాతం రుణ సౌకర్యం కల్పిస్తుందన్నారు. అలాగే 35 శాతం సబ్సిడీ అందజేస్తుందని తెలిపారు. వ్యాపారానికి సంబంధించి ఆధునిక పద్ధతులు, పరికరాలు వినియోగం, తదితర రంగాల్లో శిక్షణ సైతం ఇస్తారన్నారు. జిల్లాలో ఈ రంగాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. హార్టికల్చర్ డీడీ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మధ్య తరహా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు మంచి అనువైన వాతావరణం ఉందని తెలిపారు. దీన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని యూనిట్‌లు ఏర్పాటు చేస్తే లాభదాయకంగా ఉంటుందన్నారు. ఇందుకు తమ శాఖ నుంచి అవసరమైన పూర్తి సహాయ సహకారాలను అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రతినిధి మ్యాజ్యూస్, డీపీఎం రవికుమార్, ఏపీఎంలు మధు, సుబ్బారెడ్డి, గోపాల్‌రెడ్డి, హేమ తదితరులు పాల్గొన్నారు.