
మొగిలి ఘాట్‌లో ప్రమాదం.. లారీ డ్రైవర్ మృతి
బంగారుపాళెం: మండలంలోని మొగిలి ఘాట్ లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందగా, క్లీనర్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. ఎస్‌ఐ కథనం మేరకు.. మంగళూరు నుంచి రాజమహేంద్రవరానికి వెళుతున్న లారీ మార్గం మధ్యలో మొగిలి ఘాట్ వద్ద ముందువెళుతున్న మరో లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా గండేపల్లె మండలం జెడ్.రాగంపేటకు చెందిన లారీ డ్రైవర్ సూర్యచంద్రరావు(51) తీవ్రంగా గాయపడి క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, లారీ క్యాబిన్‌లో ఇరుక్కపోయిన డ్రైవర్‌ను స్థానికులు, ఇతర వాహనచోదకుల సాయంతో అతికష్టంపై బయటకు తీశారు. చికిత్స నిమిత్తం హైవే అంబులెన్స్‌లో బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
కార్మికుడి మృతి
నగరి : మండలంలోని వీకేఆర్ పురం గ్రామం వద్ద నగరి– తిరుత్తణి హైవేపై మోటారు సైకిల్ కల్వర్ట్‌ను ఢీకొనడంతో రాజ్ కమల్ (35) అనే కార్మికుడు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కథనం మేరకు.. నగరి పట్టణం వీకేఎస్ లేఅవుట్ లో కాపురమున్న రాజ్‌కమల్ శుక్రవారం తిరుత్తణిలో మృతి చెందిన బంధువు అంత్యక్రియలకు మోటారు సైకిల్‌పై వెళ్లాడు. అనంతరం తిరిగి ఇంటికి వస్తుండగా మార్గం మధ్యలో వీకేఆర్ పురం వద్ద మోటారుసైకిల్ అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. దీంతో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తర లించారు. ప్రైవేటు కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్న రాజ్‌కమల్‌కు భార్య, 3వ తరగతి చదివే ఒక కుమార్తె, 4వ తరగతి చదివే ఒక కుమారుడు ఉన్నారు. ఇతని మరణంతో వీకేఎస్ లేఅవుట్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
సర్పంచ్‌లకు
గౌరవ వేతనం విడుదల
చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో సర్పంచ్‌లకు రూ.49,69,138 గౌరవ వేతనం విడుదలైందని డీపీఓ సుధాకర్‌రావు తెలిపారు. ఎన్నికలు జరిగిన 684 పంచాయతీల్లోని సర్పంచ్‌లకు రెండో విడత కింద ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఇచ్చిందన్నారు. ఒక్కొక్క సర్పంచ్‌కు గౌరవ వేతనంగా రూ.3 వేలు వంతున విడుదల కాగా వాటిని బ్యాంకు ఖాతాలకు జమచేయనున్నామని తెలిపారు.

మొగిలి ఘాట్‌లో ప్రమాదం.. లారీ డ్రైవర్ మృతి