
పోలీసునని చెప్పి.. మహిళల వద్ద బంగారం లూటీ
చిత్తూరు అర్బన్: పోలీసునని చెప్పి మహిళల వద్ద బంగారం లూటీ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం స్థానిక పోలీసు అతిథిగృహంలో సీఐ మహేశ్వర ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది జూన్‌లో ఓ ప్రేమజంట చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఒంటరిగా ఉంది. వారి వద్దకు వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తి తాను పోలీసునని చెప్పి పరిచయం చేసుకున్నాడు. ‘మీరు ఇక్కడ చేస్తున్న చేష్టలన్నీ డ్రోన్ కెమెరాలో రికార్డు అయ్యాయి. స్టేషన్‌కు పదండి..’ అంటూ బెదిరించాడు. స్టేషన్‌కు వెళితే పరువు పోతుందని మహిళ వేడుకోగా, మెడలో ఉన్న బంగారు గొలు సును లాక్కుని వారిని వదిలేశాడు. గతనెల కూడా ఇదే తరహా ఘటన వేలూరు రోడ్డులో చోటు చేసుకుంది. బాధితులు ఎట్టకేలకు ధైర్యం చేసి, జరిగిన విషయాన్ని మూడు రోజుల క్రితం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుడు కొంగారెడ్డిపల్లెకు చెందిన అఖిల్(30)గా గుర్తించారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. 2022 లో కూడా నిందితుడిపై ఈ తరహా కేసు నమోదైనట్లు సీఐ తెలిపారు. పీవీకేఎన్ కళాశాల వెనుక ఉన్న అటవీప్రాంతంలో తిరుగు తున్న అఖిల్‌ను పట్టుకున్న పోలీసులు, అతడి వద్ద ఉన్న 12 గ్రా ముల రెండు బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి, న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా రిమాండ్‌కు ఆదేశించారు. అనంతరం నిందితుడిని చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. కాగా నిందితుడిపై కేసు నమోదు కావడంతో అతడిని విధుల నుంచి తొలగించినట్లు మున్సిపల్ కమిషనర్ నర సింహ ప్రసాద్ తెలిపారు. మరోవైపు నిందితుడికి వైఎస్సార్‌సీపీ నేతల ప్రోద్బలంతోనే కార్పొరేషన్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం లభించిందని సీఐ వ్యాఖ్యానించారు. దీనిపై ఆ పార్టీ చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేత వద్ద పీఏగా పనిచేసిన నిందితుడు, విధులకు వెళ్లకుండా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అక్రమంగా వేతనాలు పొందాడని ఆరోపించారు. ఇతను అధికారపార్టీ నేతలకు కొమ్ముకాస్తే, నిందను తమపార్టీపై వేయడం సీఐ అవివేకానికి నిదర్శమమని మండిపడ్డారు.