
నేటమ్స్ షుగర్స్ చైర్మన్ అరెస్టు
నిండ్ర : నిండ్ర నేటమ్స్ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ నందకుమార్‌ను శుక్రవారం రాత్రి పోలీసులు ఆరెస్టు చేశారు. చెరుకు రైతు లకు, ఫ్యాక్టరీ కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించక ఫ్యాక్టరీ మూసివేసి వెళ్లడంతో అతనిపై వారు నమోదు చేసిన కేసులు నడుస్తున్నాయి. 2019 నుంచి 22 వరకు ఫ్యాక్టరీ నిర్వహణ చేపట్టిన కాలంలో 3,210 మంది రైతులు వారు పండించిన చెరుకును ఫ్యాక్టరీకి తరలించారు. వీరికి రూ. 37 కోట్లు చెల్లించాల్సి ఉంది. అలాగే 310 మంది కార్మికులు ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా వారికి ఏడాది పాటు జీతాలు చెల్లించక ఫ్యాక్టరీ మూసివేయడంతో వారికి చెల్లించాల్సిన వేతనాల బకాయిలు రూ.6 కోట్లు ఉంది. బకాయిలు చెల్లించక 2022 సంవత్సరం ఫ్యా క్టరీని ఆకస్మికంగా మూసివేయడంతో రైతులు, కార్మికులకు బకాయిలు చెల్లించలేదు. దీనిపై చెరుకు రైతు సంఘాలు, కార్మిక యూనియన్‌ల నేతృత్వంలో పలు మార్లు, ఆందోళనలు నిరసనలు, నిరాహార దీక్షలు చేశారు. ఫ్యాక్టరీ కార్మికులు విడివిడిగా యాజమాన్యంపై కేసులు వేశారు. ఈనేపథ్యంలో శుక్రవారం తిరుపతిలో సౌత్ ఇండియా షుగర్ మిల్ అసోసియేషన్ సమావేశానికి నందకుమార్ విచ్చేశారు. సమాచారం అందుకుని నందకుమార్‌ను అక్క డే అదుపులోకి తీసుకున్నట్లు నగరి రూరల్ సీఐ భాస్క ర్ తెలిపారు. కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.