
మా భూములు వదిలేయండి సామీ!
రామకుప్పం(కుప్పం): అభివృద్ధి పేరిట తమకు జీవనాధారమైన వ్యవసాయ భూములను లొక్కోవద్దని కోరుతూ రామకుప్పం మండలంలోని రెండు గ్రామాల రైతులు నిరసనకు దిగారు. మండలంలోని మణేంద్రం పంచాయతీ రైతులు శుక్రవారం ఆ గ్రామ సచివాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించారు. ఇప్పటికే విమానాశ్రయం కోసమని రెండు విడతలుగా తమ భూములను లాక్కున్న ప్రభుత్వం పరిశ్రమల పేరుతో మరో సారి భూ సేకరణ చేస్తోందని వాపోయారు. హంద్రీనీవా కాలువలో నీరు వచ్చిన ఆనందం తమకు 15 రోజులు కూడా లేకుండా చేస్తూ మళ్లీ 600 ఎకరాల భూములు లాక్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బంజరు భూములను చదును చేసి, అభివృద్ధి చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నామని చెప్పారు. భూములన్నీ కోల్పోతే రైతు, వ్యవసాయ కూలీల కుటుంబాలు వీధిన పడతాయన్నారు. నలబై ఏళ్లుగా సీఎం చంద్రబాబును గుండెల్లో పెట్టుకుని గెలిపిస్తుంటే ఇలా చేయడం తగదన్నారు. రైతుల సాగు భూముల్లో కాక మరో చోట ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో పరిశ్రమలు పెట్టాలని కోరారు. సీఎం, జిల్లా కలెక్టర్లు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. మరో వైపు తమ భూముల్లో సోలార్ ప్రాజెక్టు వద్దని బల్ల గ్రామానికి చెందిన బాధిత రైతులు నిరసనకు దిగిన అంశం వెలుగులోకి వచ్చింది. కంపెనీ ప్రతినిధులు జేసీబీలతో భూమి చదునుకు పూనుకోవడంతో రైతులు, వారి కుటుంబ సభ్యులు పనులను అడ్డుకున్నారు. ప్రభుత్వం తమకు కేటాయించి, సాగు చేసుకుంటున్న భూముల్లో తమకు తెలియకుండానే పనులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు, రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకున్నా బాధితులు జేసీబీలను పని చేయనివ్వలేదు. అధికారులు సాంకేతిక అంశాలను ప్రస్తావించినా రైతులు అంగీకరించలేదు. తాము సాగు చేస్తున్న భూములను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు.

మా భూములు వదిలేయండి సామీ!