
సమస్య చెప్పుకునే హక్కు కూడా లేదా?
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సచివాలయాల్లో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ బదిలీలు ఇటీవల నిర్వహించారు. ఈ బదిలీల్లో అన్యాయం జరిగిందంటూ చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుంచి అధిక సంఖ్యలో విచ్చేసిన అగ్రికల్చర్ అసిస్టెంట్‌లు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ ధర్నాలో చంటి పిల్లలతో పలువురు మహిళా సచివాలయ ఉద్యోగులు తమ ఆవేదనను కలెక్టర్‌కు విన్నవించుకునేందుకు విచ్చేశారు. బదిలీల్లో చోటు చేసుకున్న అన్యాయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించుకునేందుకు వస్తే దురుసుగా ప్రవర్తించడంతో సమస్యలు చెప్పుకునే హక్కు కూడా తమకు లేదా? అంటూ అగ్రికల్చర్ అసిస్టెంట్ ధర్నాలో ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో అగ్రికల్చర్ అసిస్టెంట్లు మాట్లాడుతూ ఇటీవల అగ్రికల్చర్ అసిస్టెంట్‌లకు నిర్వహించిన బదిలీలు పూర్తిగా జీఓ నంబర్ 5కు విరుద్ధంగా చేపట్టారన్నారు. ఎలాంటి మెరిట్ లిస్ట్ ప్రదర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్య చెబితే నోరు మూసుకోమన్నారు!
తమకు జరిగిన ఆవేదనను చెప్పుకునేందుకు వెళితే సానుకూలంగా స్పందించాల్సిన చిత్తూరు జిల్లా వ్యవసాయ శాఖ జేడీ మురళీకృష్ణ నోరుమూసుకోమని చెప్పడం ఎంతవరకు న్యాయమని అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని అధికారులతో కాకుండా ఇంకెవరితో చెప్పుకోవాలని ప్రశ్నించారు. ర్యాంకులు, మెరిట్ ఉన్న వారికి ఎక్కడో దూర ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారన్నారు. ఎమ్మెల్యేల సిఫార్సులు, ముడుపులు ఇచ్చిన వారికి బదిలీల్లో న్యాయం చే శారని ఆరోపించారు. పలుకుబడి లేని, ముడుపులు ఇచ్చుకోని తమకు అన్యాయం చేశారని మండి ప డ్డారు. అనంతరం బదిలీల్లో జరిగిన అన్యాయంపై కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీకి విన్నవించుకు న్నారు. పరిశీలించిన ఆయన ఆయా శాఖల అధికారులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. త్రిశూల్, సెల్వం, భవ్య, పావని పాల్గొన్నారు.
● కలెక్టరేట్ ఎదుట ఉమ్మడి చిత్తూరు జిల్లా అగ్రికల్చర్ అసిస్టెంట్ల ధర్నా