
సాక్షి,చిత్తూరు : వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో పోలీసులు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారు. బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వైఎస్ జగన్ పర్యటనలో సెక్యూరిటీని వదిలేసి కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా పోలీసులు ఉన్నతధికారులు పనిచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర కష్టనష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను పరామర్శించేందుకు వైఎస్ జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌యార్డును సందర్శించారు. మామిడి రైతుల్ని పరామర్శించారు. వారికి తానున్నాననే భరోసా కల్పించారు.
అయితే,ఈ పర్యటనలో అడుగడుగునా భద్రతా లోపాలు కనిపించాయి. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న జగన్‌కు భద్రత కల్పించటంలో ప్రభుత్వం విఫలమైంది. వైఎస్ జగన్ పర్యటనను ముగ్గురు ఎస్పీలు, రేంజి ఐజీ ఆసాంతం ఫాలో అయ్యారు. కానీ జగన్ మామిడి యార్డులోకి వెళ్లేసరికి పోలీసులు సెక్యూరిటీ కనుచూపుమేరలో కనిపించలేదు. జగన్ రైతులను కలిసేందుకు వెళ్తుంటే అడుగు ముందుకు పడడం కష్టమైంది.
అదే సమయంలో వైఎస్ జగన్ పర్యటనకు జనాన్ని రానీయకుండా చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఓ సీఐ కార్యకర్త తల పగులకొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. పరామర్శించేందుకు వెళ్లబోయిన మాజీ సీఎంను కారు దిగనీయకుండా ఎస్పీ మణికంఠ అడ్డుపడ్డారు. ఆ తర్వాత కూడా జనాన్ని రానీయకుండా పోలీసులు కుట్ర చేయడం అందుకు ఉదాహరణగా నిలుస్తోంది