
సాక్షి,చిత్తూరు: బంగారుపాళ్యంలో ఇవాళ పోలీసులు వ్యవహరించిన తీరును వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. రైతులను ఏదో రౌడీ షీటర్లుగా వ్యవహరిస్తూ దురుసుగా ప్రవర్తించారంటూ పోలీసులపై మండిపడ్డారాయన.
‘రైతుల తలలు పగలకొడతారా? 1,200 మందిని జైల్లో పెడతారా?. రాష్ట్రంలో ఉంది పోలీసులా? రాక్షసులా?. కూటమి ప్రలోభాలు,లంచాలకు పోలీసులు లొంగొద్దు. రేపు పోలీసులను కూడా చంద్రబాబు మోసం చేయొచ్చు. అప్పుడు కూడా నేనే మీ తరుఫున పోరాటం చేయాల్సి వస్తుంది. ఒక్కటి గుర్తుంచుకోండి.. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు
ప్రతి పోలీసు అధికారికీ ఒకటే చెబుతున్నా. అయ్యా ప్రతి పోలీస్ సోదరుడా.. మీకు కూడా సమస్యలుంటాయి. ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా.. పలికేది ఒక్క జగన్ మాత్రమే. పొగాకు రైతులకు సమస్య అయినా జగనే పలుకుతున్నాడు. మామిడి రైతుల సమస్యల పైనా జగనే పలుకుతున్నాడు. మిర్చి రైతులైనా జగనే పలుకుతున్నాడు. ఉద్యోగుల సమస్యలైనా.. వాళ్లకు మధ్యంతర భృతి (ఐఆర్) ఇవ్వాలన్నా, వేతనాల సవరణ (పీఆర్సీ) డిమాండ్ చేయాలన్నా, వాళ్లకు కరవు భత్యం (డీఏ) ఇప్పించాలన్నా, చివరికి చంద్రబాబునాయుడు హామీలను నిలదీస్తూ, ఆయన్ను గట్టిగా ప్రశ్నించాలన్నా, ఆయన సూపర్ సిక్సు, సూపర్ సెవెన్లు అమలు చేయకుండా మోసం చేసిన వైనాన్ని ఎండగట్టాలన్నా.. జగన్ మాత్రమే ముందుంటాడు. ప్రతి పోలీస్ సోదరుడు దీన్ని గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నాను.
అధికారంలో ఉన్న ఆ ఎస్పీలు, డీఐజీలు, సీఐలు వీళ్ల మాటలు వినకండి. వీళ్ల ప్రలోభాలకు లొంగకండి. రేప్పొద్దున మీ సమస్యలపైనా ఇదే మాదిరిగానే చంద్రబాబు మిమ్మల్ని మోసం చేసి రోడ్డున పడేస్తే.. అప్పుడు జగన్ అనే వ్యక్తి ముందుకు వస్తాడు. లేదంటే ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడేవాడు ఎవడూ ఉండడు. అసలు సమస్యలే లేనట్లు వక్రీకరిస్తారు. డ్రామాలాడతారు. తప్పుదోవ పట్టిస్తారు. అలా సమస్యలను గాలికి వదిలేసే పరిస్థితి వస్తుంది. ఇంకా అందరూ నష్టపోయే కార్యక్రమం కూడా జరుగుతుందని ప్రతి పోలీస్ సోదరుడికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రేపు రాబోయేది జగన్ ప్రభుత్వం. గుర్తుంచుకోండి’’ అని హితబోధ చేశారాయన.
కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర కష్ట నష్టాల్లో కూరుకుపోయిన మామిడి రైతులను బుధవారం వైఎస్ జగన్ పరామర్శించారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్‌లో మామిడి రైతులను కలిసి, వారి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా.. కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారాయన.