
శ్రీకాళహస్తి పెద్దాస్పత్రిలో రక్తపాతం
● అధికార పార్టీకి చెందిన ఇరువర్గాల దాడులు ● ఐదుగురికి తీవ్ర గాయాలు ● ఏ పార్టీకి సంబంధం లేదంటూ డీఎస్పీ ప్రకటన
సాక్షి టాస్క్ ఫోర్స్: అర్ధరాత్రి వేళ పెద్దాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వర్గానికి చెందిన వారిపై, మరో వర్గం యువకులు దాడి చేయడంతో క్యాజు వాలిటీ విభాగం రక్తంతో తడిచింది. ఏం జరుగుతోందో అర్థం కాక వైద్య సిబ్బంది, సెక్యూరిటీ గా ర్డులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ భయానక ఘటన ఆదివారం అర్ధరాత్రి శ్రీకాళహస్తి ఏరి యా ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఏరియా ఆసుపత్రి సీసీ కెమెరాలో నమోదైన దాడి దృశ్యాలు సా మాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. శ్రీకాళహస్తిలో ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి అగ్నిగుండ మహోత్సవం సందర్భంగా పట్టణంలోని మంచినీళ్లగుంట, వీఎం పల్లికి చెందిన యువకుల మధ్య ఆదివారం రాత్రి వాగ్వాదం చోటుచేసుకుంది. అగ్నిగుండ ప్రవేశం ముగిసిన అనంతరం అర్ధరాత్రి వేళ, తొట్టంబేడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో మంచినీళ్ళగుంట, వీఎంపల్లికి చెందిన యువకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మంచినీళ్లగుంటకు చెందిన ఇద్దరు యువకులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మరికొంత మందిని వెంట తీసుకొచ్చిన వీఎం పల్లి యువకులు ఏరియా ఆస్పత్రి క్యాజువాలిటీ విభాగంలోకి చొరబడి చికిత్స పొందుతున్న యువకులు, వారి బంధువులపై కర్రలు, మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మంచినీళ్ల గుంటకు చెందిన వారు కూడా తిరగబడి రాళ్లు రువ్వడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ సమయంలో వీఎంపల్లికి చెందిన యువకుల ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేశారు. పెట్రోలు పోసి తగులబెట్టే ప్రయత్నంలో ఉండగా ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అయితే దాడులకు పాల్పడింది టీడీపీకి చెందిన యువకులు కావడంతో ఆస్పత్రి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ స్పందించడం లేదు. ఏం జరిగింది అనేది చెప్పడానికి కూడా ముందుకు రావడం లేదు.