
జగనన్న వస్తున్నాడనీ..!
‘మామిడి’పై ఉరుకులు పరుగులు
● జగన్ పర్యటనతో రైతులను కట్టడి చేస్తున్న కూటమి నేతలు ● ధరల్లేక.. చెట్లు కొట్టేస్తుంటే రైతులపై అటవీశాఖ కేసులు ● ఉన్నట్టుండి రైతులపై ప్రేమ ఒలకబోస్తున్న కూటమి ప్రభుత్వం ● పరిశ్రమల నిర్వాహకులతో ప్రిన్సిపల్ కార్యదర్శి సమీక్షలు ● అయినా సరే.. ఇప్పటికీ కిలో మామిడి ధర తెలియని రైతు
ఇంతకూ కిలో మామిడి ఎంత?
పంట పండించే రైతుకు దాని ధరను నిర్ణయించే హక్కు ఉంటుంది. కానీ మామిడి రైతు మాత్రం తాను పండించిన పంటకు ఇప్పటి వరకు ధర చెప్పలేకపోతున్నాడు. సీజన్ ప్రారంభంలో రూ.12 ప్రకటించిన కూటమి ప్రభుత్వం, ఆపై రూ.8 ప్రకటించి.. మిగిలిన రూ.4 ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అటు తరువాత అధికారులు రూ.6 ప్రకటించారు. ఇపుడు కిలో రూ.4–5 మధ్య అంటున్నారు. ర్యాంపుల వద్ద రూ.2–3 పలుకుతోంది. అసలు రైతు నుంచి టన్నలకొద్దీ పంట కొనుగోలు చేసిన ఫ్యాక్టరీలు ఏ ఒక్కరికీ ధర చెప్పలేదు. రైతుల నుంచి ఎంత పటం కొన్నామని స్లిప్పులు ఇస్తున్నారే తప్ప.. అందులో ధర ఎంతని పేర్కొనకపోవడం మామిడి రైతుల దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.
చిత్తూరు అర్బన్: అధికారంలో ఉన్న పాలకులు ప్రజల కష్టాలను పట్టించుకోనప్పుడు ప్రతిపక్షం అంకుశమై ప్రశ్నిస్తుంది. జిల్లాలో మామిడి రైతుల కష్టం విని, కన్నీళ్లు తుడవడానికి ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారని తెలిసిన కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. అయినా సరే, మామిడి రైతు కష్టం తీరలేదు. కన్నీళ్లు ఆగడం లేదు. వైఎస్.జగన్ ఫీవర్ పట్టుకున్న యంత్రాంగం.. క్షేత్ర స్థాయిలో పర్యటనలు, సమీక్షలు నిర్వహిస్తూ మసిపూసి మామిడి రైతును ఏమార్చే ప్రయత్నం చేస్తోంది.
ఇప్పటి వరకు ఏం చేశారు?
ఉమ్మడి జిల్లాలో దాదాపు 56 వేల హెక్టార్లలో మామిడి సాగవుతుంటే.. 39,895 హెక్టార్లలో తోతాపురి చెట్ల నుంచి సుమారుగా 5 లక్షల టన్నుల కాయలు దిగుబడి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గత నెల ప్రారంభమైన మామిడి సీజన్.. మరో పది రోజుల్లో ముగియనుంది. ఈ సారి మామిడి విస్తారంగా కాయడంతో రైతులంతా పొంగిపోయారు. కానీ రైతుల ఆశలు ఎన్నో రోజులు నిలవ లేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కిలో మామిడికి రూ.12. కానీ జిల్లాలో ఏ ఒక్క ఫ్యాక్టరీ ఈ ధరను చెల్లించ లేదు. చిత్తూరు, గుడిపాల, తవణంపల్లె, పూతలపట్టు ప్రాంతాల్లో గుజ్జు ఫ్యాక్టరీల వద్ద రాత్రింబవళ్లు రైతులు మామిడి కాయల లోడ్‌లతో నిరీక్షిస్తున్నారు. తొలుత టోకెన్ల పద్ధతిని ప్రవేశపెట్టిన ఫ్యాక్టరీల యాజమాన్యాలు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడాయి. ఆపై ఎవరు ముందు వస్తే, వాళ్ల పంటను లోపలకు అనుమతిస్తామన్నారు. అసలు కాయలు లోపలకు వెళితే చాలని రైతులు తిండీనిద్ర లేకుండా ఫ్యాక్టరీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల గిట్టుబాటు ధర రాకపోవడం, ఫ్యాక్టరీలోలపకు కాయలు తీసుకెళ్లలేని పరిస్థితుల్లో పంటను రైతులు రోడ్లపై పారబోశారు. లారీల్లో మామిడి తీసుకొచ్చి ప్రజలకు ఉచితంగా పంచి పెట్టారు. ఇన్ని జరుగుతున్నా ఏ ప్రజాప్రతినిధి చేసిందేమీలేదు. అధికారులు సాధించిందీ లేదు. కానీ ఒక్క జగన్ వస్తున్నాడని తెలిసిన వెంటనే ఏకంగా రైతులతో ముఖ్యమంత్రి సమావేశం కావడం, మామిడికి మద్దతు ధర ఇస్తామని ప్రగల్భాలు పలకడం, ప్రిన్సిపల్ కార్యదర్శి చిత్తూరు జిల్లాకు వచ్చి సమీక్షలు నిర్వహించడం, ఫ్యాక్టరీల వద్దకు పరుగులు పెట్టడం చూస్తుంటే జగన్ అంటే ఎంత భయమో అర్థమవుతోంది.
ఏడుస్తున్న రైతులపై కేసులు
పరిస్థితిని గమనించిన రైతులు మామిడికి భవిష్యత్తు ఉండదనే నిర్ధారణకు వచ్చేశారు. ఉన్న పంటను పారబోసి, వచ్చినకాడికి ఫ్యాక్టరీలకు అప్పగించి.. మామిడి పంటే వద్దనే నిర్ణయానికి వచ్చేశారు. చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లోని పలువురు రైతులు మామిడి చెట్లను పూర్తిగా తొలగించేశారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతుందని, ప్రతిపక్షానికి ఈ అంశం అంకుశంగా మారుతుందని భావించిన కూటమి ప్రభుత్వం కపట ప్రణాళిక రచించింది. చెట్లు కొట్టేస్తున్న రైతులపై వాల్టా చట్టం కింద కేసులు నమోదుచేయించి, జరిమానాలు విధించేలా అటవీశాఖ అధికారులను ఆదేశించింది. జిల్లాలో ఆరుగురు రైతులపై కేసులు నమోదుచేయించి, జరిమానాలు విధించింది. తమకు ఆత్మహత్యలే శరణ్యమైన ఇలాంటి సమయంలో గుండె లోతుల్లోంచి వస్తున్న బాధను దిగమింగుకుని.. తమ కష్టాలు విన్నవించడానికి జగన్ రాక కోసం రోజులు లెక్కబెడుతున్నామని రైతులు పేర్కొంటున్నారు.