విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి చర్యలు | - | Sakshi
Sakshi News home page

విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి చర్యలు

Jul 4 2025 3:46 AM | Updated on Jul 4 2025 3:46 AM

విభిన

విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి చర్యలు

చిత్తూరు కలెక్టరేట్‌ : విభిన్నప్రతిభావంతుల శ్రేయస్సు, అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర సామాజిక, న్యాయ సాధికారత మంత్రి రాందాస్‌ అతవాలే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన కేంద్ర మంత్రి మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల చట్టాన్ని 27 డిసెంబర్‌ 2016లో అమలు చేసినట్టు వెల్లడించారు. ఈ చట్టంలో వైకల్య వర్గాలను 7 నుంచి 12కి పెంచామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్‌లు 3 నుంచి 4 శాతానికి పెంచినట్టు పేర్కొన్నారు. ఉన్నత విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు 3 శాతం నుంచి 5 శాతానికి పెంచినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా 1,314 ప్రభుత్వ భవనాలను దివ్యాంగుల కోసం సుగమ్య అభియాన్‌ పథకంలో నిర్మించినట్టు వెల్లడించారు. ఈ భవనాలకు రూ.563.85 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. మొత్తం 35 అంతర్జాతీయ, 55 దేశీయ విమానాశ్రయాలను అందుబాటులోకి తీసుకొచిన్నట్లు వివరించారు. 709 రైల్వే స్టేషన్లు, 8,695 బస్సులు, 637 వెబ్‌సైట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. 8.34 లక్షల పాఠశాలల్లో ర్యాంప్‌లు, హ్యాండ్‌రైల్‌లు అందుబాటులో ఉండే మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఏపీలో యాక్సెసిబుల్‌ ఇండియా ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌లో యాక్సెసిబుల్‌ ఇండియా ప్రచారంలో 38 భవనాలకు రూ.29.60 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. విద్యా సాధికారత దిశగా స్కాలర్‌ షిప్‌ పథకంలో 2.81 లక్షల మంది దివ్యాంగ విద్యార్థులకు రూ.921.50 కోట్లను మంజూరు చేశామన్నారు. స్కాలర్‌షిప్‌ నగదును నేరుగా అర్హులైన విద్యార్థుల ఖాతాలకు జమచేస్తున్నట్లు తెలిపారు. ఏపీలోని 7093 మంది దివ్యాంగులకు రూ.45.25 కోట్ల స్కాలర్‌షిప్‌లు అందజేశామన్నారు. డీడీఎస్‌ పథకంలో 3.84 లక్షల మంది లబ్ధిదారులకు రూ.951.77 కోట్లకు పైగా ప్రయోజనం పొందారన్నారు. ఏపీలో రూ.193.92 కోట్లతో 60,488 మంది దివ్యాంగులకు ప్రయోజనం కలిగిందన్నారు. చిత్తూరు జిల్లాలో ఏడీపీ, ఆర్‌వీవై పథకాల్లో నిర్వహించిన పరీక్ష శిబిరాల నుంచి మొత్తం 3,505 మంది లబ్ధిదారులను గుర్తించారన్నారు. వారందరికీ రూ.4.69 కోట్ల విలువైన 8,916 ఉపకరణాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. అనంతరం దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌, ట్రైనీ కలెక్టర్‌ నరేంద్ర పడాల్‌, డీఆర్‌వో మోహన్‌కుమార్‌, ఏఎస్పీ రాజశేఖర్‌రాజు, డీఎస్‌పీ సాయినాథ్‌, జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ వినోద్‌, బీజేపీ నాయకులు చిట్టిబాబు, అట్లూరి శ్రీనివాసులు, దివ్యాంగుల సంఘం నాయకులు మురళి పాల్గొన్నారు.

ఉపకరణాల పంపిణీలో కేంద్ర మంత్రి రాందాస్‌ అతవాలే

విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి చర్యలు 1
1/1

విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికి చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement