
ఊరుబడంటే అలుసా?
చిత్తూరు రూరల్(కాణిపాకం): తమ పిల్లల చదువుకు ఊరు బడంటే ఒప్పుకుంటామని.. లేకుంటే తమిళనాడులోని ప్రభుత్వ బడికి పంపుతామని పిల్లల తల్లిదండ్రులు రోడెక్కారు. చిత్తూరు మండలం, అనంతాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విలీ నంపై మంగళవారం పిల్లల తల్లిదండ్రులు నిరసనకు దిగారు. వారు మాట్లాడుతూ స్థానిక ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం 24 మంది విద్యార్థులు ఉన్నా రన్నారు. ఈ పాఠశాలను విలీనం చేయడంతో పిల్లలంతా రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న బీఎన్‌ఆర్ పేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. చిత్తూరు తిరుత్తణి జాతీయ రహదారి మీదుగా పిల్లలు బడికి వెళ్లాలని, భారీ వాహనాల రాకపోకల నడుమ ఈ ప్రయాణం అత్యంత ప్రమాదకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని వాపోయారు. విలీనం మాకొద్దని.. ఊరుబడే ముద్దు అంటూ నినాదాలు చేశారు. అధికారులు స్పందించకుంటే కి.మీ పరిధిలో ఉన్న తమిళనాడులోని ప్రభుత్వ బడులకు తమ పిల్లలను పంపుతామని స్పష్టం చేశారు. కావాలంటే రేషన్ కార్డులు కూడా రద్దు చేసుకోమని వారు ఆగ్రహానికి గురయ్యారు. గ్రామస్తులు భానుచందర్, సుదీర్, శశికళ, అరుణాయాకాంబరం, తంగమని, మురళి, బాబు, వాణి, రామన్, నదియా పాల్గొన్నారు.