రగులుతున్న తమ్ముళ్లు! | - | Sakshi
Sakshi News home page

రగులుతున్న తమ్ముళ్లు!

May 13 2025 2:49 AM | Updated on May 13 2025 2:49 AM

రగులుతున్న తమ్ముళ్లు!

రగులుతున్న తమ్ముళ్లు!

నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై టీడీపీ సీనియర్‌ నేతలు తీవ్రమైన అంసతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పార్టీకి సేవలందిస్తే కనీస గౌరవం దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు. కూటమి గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తే అసలు గుర్తింపే లేకుండా పోయిందని వాపోతున్నారు. ఎన్నికల ముందు కండువా కప్పుకున్న వారికే పదవులు కేటాయించడంపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు నాయకులు తమ స్థాయికి తగని పోస్టులు కట్టబెట్టడంపై కినుక వహిస్తున్నారు. ఇంతకాలం ఎదురుచూసినందుకు ఇంతగా అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు గుర్తింపు, గౌరవం రెండూ లేవని కొందరు టీడీపీ నేతలు మధనపడుతున్నారు. మొదటి నుంచి పార్టీ విజయం కోసం పనిచేసిన తమను కాదని ఎన్నికల ముందు చేరిన వారికి ఉన్నత పదవులు కట్టబెట్టడంపై మండిపడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అతి ముఖ్యమైన తుడా చైర్మన్‌ పదవిని డాలర్స్‌ దివాకర్‌రెడ్డికి, మొన్న డీసీసీబీ చైర్మన్‌ పోస్టును అమాస రాజశేఖరరెడ్డికి ఇవ్వడంతో నామినేటెడ్‌ పదవులన్నీ దాదాపు భర్తీ పూర్తయినట్లేనని కూటమి నేతలు చెబుతున్నారు. ఈ రెండు పదవులు తమకే వస్తాయని ఆశగా ఎదురుచూసిన టీడీపీ సీనియర్‌ నేతలు నైరాశ్యంలో మునిగిపోయారు. ఇక నామినేటెడ్‌ పదవుల్లో ఆశించేందుకు ఏమీ లేకుండా పోయినట్లేనని ఆగ్రహంగా ఉన్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పరిధిలో టీడీపీలో అనేక మంది సీనియర్‌ నేతలు ఉన్నారు. అలాగే టీడీపీ కోసం తెరవెనుక నుంచి పనిచేసిన కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. వారంతా ముందుగా టీటీడీ పాలకమండలి సభ్యత్వం కోసం పోటీపడ్డారు. అలా ఆశించిన వారిలో జిల్లాకు చెందిన టీడీపీ నేతలెవరికీ టీటీడీ పాలకమండలిలో చోటు దక్కలేదు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ద్వారా బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్‌ పోస్టును ఎగరేసుకుపోయారు. ఎన్టీఆర్‌ హయాం నుంచి టీడీపీనే నమ్ముకునిఏళ్లుగా ఎదురుచూస్తున్న వారందరికీ భంగపాటు తప్పలేదు.

చిత్తూరు జిల్లాలోనూ..

చిత్తూరు జిల్లా పరిధిలోని కుప్పం, పుంగనూరు, పూతలపట్టు, చిత్తూరు, జీడీ నెల్లూరు, నగరి నియోజక వర్గాల్లో పదుల సంఖ్యలో ఉన్న టీడీపీ నాయకులందరికీ కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపించింది. డీసీసీబీ చైరర్మన్‌ పదవి కోసం మాజీ ఎమ్మెల్సీ దొరబాబు చాలా నమ్మకంగా ఉన్నారు. జిల్లాలో సీనియర్‌ నాయకుల్లో ప్రథముడు. టీడీపీనే నమ్ముకుని ఉన్నారు. అయితే దొరబాబుని కాదని, అమాస రాజశేఖరరెడ్డికి చైర్మన్‌ గిరీ కట్టబెట్టారు. ఆయన గతంలో డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న సమయంలో అడ్డగోలుగా కుప్పం నియోజక వర్గానికి నిధులు కేటాయించారే విషయాన్ని పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు, లోకేష్‌ మళ్లీ అమాసకే డీసీసీబీని కట్టబెట్టారు. అమాస కాంగ్రెస్‌ నుంచి టీడీపీలో చేరినట్లు కూడా పెద్దగా ప్రచారం లేదు. అదే విధంగా టీడీపీ కోసం పెద్దగా ప్రచారం చేసిన దాఖలాలు కూడా లేవని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలో మిగిలింది కాణిపాకం, బోయకొండ పాలకమండళ్లు మాత్రమే. ఆయా బోర్డుల చైర్మన్‌, సభ్యత్వం కోసం అనేక మంది ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. అందులోనైనా న్యాయం జరుగుతుందా? లేదా? అని పలువురు టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నామినేటెడ్‌ పదవుల పందేరంపై అసంతృప్తి

గుర్తింపు.. గౌరవం లేదని సీనియర్‌ నేతల ఆవేదన

ప్రాధాన్యత లేని పోస్టులు కట్టబెట్టడంపై మండిపాటు

తిరుపతి, చిత్తూరు జిల్లాల టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు

సీనియర్లందరికీ అవమానం

తిరుపతికి చెందిన ఎన్టీఆర్‌ రాజు కుటుంబం ఎన్నో ఏళ్ల నుంచి టీటీడీ బోర్డు సభ్యత్వం కోసం ఎదురుచూస్తూనే ఉంది. ఈ సారి కూడా ఆ కుటుంబానికి దక్కలేదు. తిరుపతిలో టీడీపీ అంటే గుర్తొచ్చే నాయకుల్లో ముందు వరుసలో ఉండేది నరసింహయాదవ్‌. టీడీపీ సీనియర్‌ నేతగా పచ్చ చొక్కా తప్ప మరొకటి ధరించని నరసింహయాదవ్‌ మరో పర్యాయం తుడా చైర్మన్‌ పదవిని ఆశించారు. అయితే ఆయనకు ప్రాధాన్యం లేని పదవిని కట్టబెట్టి తీవ్రంగా అవమానించారు. టీడీపీలో మరో నేత మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. ఆమె ఎమ్మెల్సీ లేదా టీటీడీ పాలకమండలి సభ్యత్వం, అది కూడా కాకుంటే తుడా చైర్మన్‌ పదవిని ఆశించారు. అయితే ఈ మూడింటిలో ఏదీ దక్కలేదు. అస్సలు ఎలాంటి ప్రాధాన్యత లేని, ఆ పదవి ఒకటి ఉందనే విషయం తెలియని గ్రీనింగ్‌ మరియు బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పోస్టును ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ విషయం తెలిసి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు, ఆమె అనుచరులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. తిరుపతి జిల్లాలో అతిముఖ్యమైన తుడా చైర్మన్‌ పదవిని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి కట్టబెట్టడంపై టీడీపీలోని అనేక మంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దివాకర్‌రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయని, అందుకు సంబంధించిన వివరాలతో అమరావతికి లేఖ పంపినట్లు తెలిసింది. పార్టీ కోసం నమ్మకంగా పనిచేస్తున్నా తమను గుర్తించలేదంటూ కొందరు నాయకులు అధిష్టానంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. అదే విధంగా శాప్‌ చైర్మన్‌ రవినాయుడుపైనా కొందరు టీడీపీ నేతలు అమరావతికి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తిరుపతి జిల్లాలో మిగిలిన శ్రీకాళహస్తీశ్వరాలయ పాలకమండలి కోసం పలువురు టీడీపీ నేతలు ఎదురుచూస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement