
కన్నీటి సంద్రమే.. ఊరంతా దుఃఖమే
● అశ్రునయనాలతో చిన్నారులకు అంత్యక్రియలు
కుప్పం రూరల్: నీటి కుంటలో పడి దుర్మరణం పాలైన ముగ్గురు చిన్నారులకు కుటుంబ సభ్యు లు, బంధువులు అశ్రునయనాలతో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు కుప్పం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. 10.30 – 11 గంటల మధ్య మృతదేహాలు దేవరాజపురానికి చేరుకున్నాయి. మృతదేహాలు గ్రామ పొలిమేరల్లోకి చేరగానే ఆర్తనాదాలతో.. ‘‘పోయిటియ్యా... కన్నా... ఇనిమే యారికిట్టె పేసిరిదీ... యార్‌కిట్టె వెలియాడిరిదీ...’’ ( వెళ్లిపోయావా కన్నా! ఇకపై ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఆడుకోవాలి? ) అంటూ కుటుంబ సభ్యులతో పాటు గ్రామం అంతా కన్నీటి సంద్రమైంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు తమ మధ్యనే ఉన్న అశ్విన్ (7) గౌతమి (6), శాలిని (7)ల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సోమవారం మధ్యాహ్నం మృతదేహాలను గ్రామ శ్మశాన వాటికకు తరలిస్తుంటే చిన్నారుల తల్లిదండ్రులు రోదనలు అందరినీ విచలితుల్ని చేశాయి. తీసుకెళ్లొద్దంటూ పిల్లల ముఖాలను ముద్దాడుతూ వారు పడిన వేదన అంతా ఇంతా కాదు. అంత్యక్రియలకు తండోపతండాలుగా హాజరై పిల్లలకు అంతిమ వీడ్కోలు పలికారు.
ఒక్కొక్కరికీ రూ.లక్ష పరిహారం
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఒకొక్కరికీ రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం చేసింది. ఈ మొత్తాన్ని ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్, ఆర్డీఓ శ్రీనివాసరాజు, డీఎస్పీ పార్థసారథి సోమవారం బాధిత కుటుంబాలకు అందజేశారు.