
కరెంట్ షాక్‌తో ఒకరి గాయాలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కరెంట్ షాక్‌కు గురై ఓ వ్యక్తికి గాయాలైన సంఘటన సోమవారం చిత్తూరు మండలం తాళంబేడు క్రాస్‌లో చోటు చేసుకుంది. వివరాలు..కొల్‌కత్తాకు చెందిన నారాయణదేవ్ తాళంబేడు క్రాస్‌లో కాంక్రీట్ పనులు చేస్తున్నాడు. ఈక్రమంలో చేతిలోని కమ్మీ కరెంటు తీగలకు తగిలి ఆ వ్యక్తి కొంత దూరం పడిపోయాడు.అక్కడ పనిచేస్తున్న వారి సాయంతో అతని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణపాయం లేదని పోలీసులు చెప్పారు.
స్వీపర్ల పెండింగ్ జీతాల కోసం ఆందోళన
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లకు పెండింగ్ జీతాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు. దీనికి నేతృత్వం వహించిన ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షులు నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ బడుల్లోని స్వీపర్ల సమస్యలు పరిష్కరించాలని ఎన్నోసార్లు కోరినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జిల్లా అధ్యక్షురాలు రాధ మాట్లాడుతూ, 2018 నుంచి 2021 వరకు ఉమ్మడి జిల్లాలోని 350 మంది స్వీపర్లకు 36 నెలల జీతాలు ఇవ్వలేదన్నారు. మిగిలిన కొంత మందికి 18 నెలల జీతాలు ఇచ్చి 14 నెలల వరకు పెండింగ్‌లో పెట్టారన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జయకుమారి, సంఘ సభ్యులు కోకిల, లక్ష్మి, హసీనా, తులసి, రోజా, మమత తదితరులు పాల్గొన్నారు.
స్కానింగ్ సెంటర్‌పై కోర్టులో కేసు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్థారణ చేస్తుండటంపై ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధారాణి తెలిపారు. ఈనెల 14న చిత్తూరులోని భరత్ నగర్‌లో స్కానింగ్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ తనిఖీ చేశారు. ఈ తనిఖీలో నిబంధనలను ఉల్లంఘించి లింగ నిర్థారణ చేస్తున్నట్లు ఓ ముఠా గుట్టును రట్టు చేయడం విదితమే. కలెక్టర్ ఆదేశాలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విచారణ పూర్తి చేసి పీసీపీఎన్‌డీటీ చట్టం ప్రకారం కేసు వేశారు. డాక్టర్లు కానివాళ్లు లింగ నిర్థారణ చేస్తున్నారని, కొన్నేళ్లుగా రూ.15వేల ఫీజుతో స్కానింగ్ చేస్తున్నట్లు తేలిందని ఆమె చెప్పారు.