
ఆయిల్ పామ్ సాగుతో అధిక దిగుబడి
గంగాధర నెల్లూరు: తక్కువ పెట్టుబడితో ఆయిల్ పామ్ సాగు చేసి అధిక దిగుబడులు పొందవచ్చ ని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మధుసూదన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కా ర్యాలయంలో గురువారం నిర్వహించిన ఆయిల్ పామ్ రైతుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఆయిల్ పామ్ సాగు చేసిన నాలుగేళ్లకే రైతులు లాభాల బాట పడతారని, అంతవరకు అంతర పంటలతో రైతులు దిగుబడులు పొందవచ్చన్నారు. ఆయిల్‌పామ్ అన్ని రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చని, రైతులకు మొక్కలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. పీడీ బాలసుబ్రమణ్యం, మండల ఉద్యాన అధికారి లోకేష్, వ్యవసాయధికారి భవాని పాల్గొన్నారు.
మద్యం షాపులో ఘర్షణ
● ఎనిమిది మందిపై కేసు నమోదు
నగరి : నగరి సమీపంలోని కీళపట్టు వద్ద బుధవారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ కేసులో 8 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ విక్రమ్ గురువారం తెలిపారు. ఒక వర్గంలో అమృతరాజ్ నాడార్, మైకెల్ సహ నలుగురిపైన, మరో వర్గంలో కుమరేశన్, రాజాసహ నలుగురిపై కేసు నమోదు చేశామన్నారు. మద్యం షాపులో జరిగిన చిన్న గొడవ చిలికి చిలికి రెండు వర్గాల ఘర్షణకు దారి తీసిందన్నారు. కేసును డీఎస్పీ పర్యవేక్షిస్తున్నారన్నారు.
బాలుడిపై కుక్కల దాడి
పుంగనూరు: పట్టణంలోని దూళ్లవాళ్లఇండ్లలో నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. గురువారం ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలుడిని కుక్కలు కరిచాయి. గాయ పడిన బాలుడిని స్థానికులు గుర్తించి బాలుడిని తల్లిదండ్రులతో కలసి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుడు చికిత్స పొందుతున్నాడు.