ఈ ఆస్పత్రికి బిడ్డలను తెస్తే బతకడంలే!
● ఏరియా ఆస్పత్రిలో మూడు నెలల చిన్నారి మృతి ● వైద్యుల నిర్లక్ష్యమేనని తల్లిదండ్రుల ఆరోపణ
పలమనేరు: ‘ఈ ఆస్పత్రికి బిడ్డలను తీసుకుని ఎప్పుడొచ్చినా ప్రాణాలతో బతకడం లేదు. ఇప్పుడు మా బిడ్డ, అంతకుముందు మా బామ్మర్థి బిడ్డ.. ప్రభుత్వాస్పత్రంటే ప్రాణాలను కాపాడాలిగానీ.. ఇలా చంపేస్తుంటే ఎలాగా?.’ అని ఆ తల్లిదండ్రులు ఆస్పత్రి వద్ద బిడ్డ శవాన్ని వడిలో పెట్టుకుని రోదిస్తుంటే అక్కడున్నవారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంఘటన పలమనేరు ప్రభుత్వ ఏరియాస్పత్రిలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పలమనేరు మండలంలోని టి.వడ్డూరు గ్రామానికి చెందిన గణేష్ కుమార్తె (3 నెలల పసికందు)కు శ్వాస ఆడడంలేదని స్థానిక ఆస్పత్రికి గురువారం ఉదయం తీసుకొచ్చారు. ఆ శిశువు పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆస్పత్రిలోని ఎన్‌బీఎస్‌యూకు తరలించారు. అక్కడ ఆక్సిజన్ పెట్టి, బేసిక్ లైఫ్ సపోర్ట్ కోసం సీపీఆర్ కూడా చేశారు. కానీ ఆ పసికందును బతికించలేకపోయారు. తల్లిపాలు పట్టించేటపుడు చిన్నారికి పొరపోయి పాలు ఊపిరితిత్తుల్లోకి చేరడంతో శ్వాస ఆడకుండాపోయిందని వైద్యులు చెబుతున్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రం ఇక్కడి వైద్యుల నిర్లక్ష్యమే తమ బిడ్డ మృతికి కారణమని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఆస్పత్రిలోని వైద్యులు డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ ఆ చిన్నారికి ఆరోగ్యం బాగోలేక తల్లిదండ్రులు చిత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సలు చేయించి ఇంటికి తీసుకొచ్చారన్నారు. ఉన్నట్టుండి శ్వాస ఆడకపోవడంతో ఇక్కడికి తీసుకొచ్చారని, తాము అన్ని రకాలుగా ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించామని తమ నిర్లక్ష్యం ఏమీ లేదన్నారు.


